జనగామ బరిలో కోదండరాం ?

Professor Kodandaram Election Campaign Warangal - Sakshi

ఢిల్లీలో రాహుల్‌తో చర్చలు..

టీజేఎస్‌ అధినేత అడిగిన సీటుఇచ్చేందుకు అధిష్టానం సుముఖత

ససేమిరా అంటున్న పొన్నాల!

టీపీసీసీ మాజీ చీఫ్‌కు అడ్డంకిగా మారనున్న వయసు నిబంధన

కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్కంఠ

సాక్షి, జనగామ: మహాకూటమి అభ్యర్థిగా జనగామ నుంచి టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం పోటీచేయనున్నట్లు తెలిసింది. ఢిల్లీలో కాంగ్రెస్, మహాకూటమి నాయకులతో రాహుల్‌గాంధీ జనగామ సీటుపై గురువారం చర్చించినట్లు సమాచారం. సోషల్‌ మీడియాలోనూ జనగామ స్థానం కోదండరాంకే అనే ప్రచారం సాగడంతో టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యతోపాటు ఆయన అనుచరుల్లో టెన్షన్‌ నెలకొంది.

జనగామ జిల్లా సాధనకు జేఏసీ పట్టువదలకుండా చివరివరకూ పోరాడడం, ఉద్యోగులతోపాటు యువతపై ఆశలతో టీజేఎస్‌ ఈ స్థానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ తో టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమి టికెట్ల కేటాయింపుపై ఇప్పటికే అనేకసార్లు చర్చలు జరిగాయి. ఎవరెన్ని స్థానాల్లో పోటీచేయాలనే విషయంలో కూటమిలోని పార్టీలు ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. ప్రకటనే మిగిలింది.

గురువారం మహాకూటమి నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇందులో జనగామ సీటుపై చర్చ జరిగినట్లుతెలుస్తోంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ జనగామ సీటు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. కోదండరామ్‌ ఎక్కడ సీటు అడిగితే అక్కడ కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనగామ సీటు అడగడం ప్రస్తుతం హాట్‌ టాఫిక్‌గా మారింది. టీజేఎస్‌కే జనగామ సీటు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో పొన్నాల లక్ష్మయ్యతో పాటు కాంగ్రెస్‌ కార్యకర్తల్లో, నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. టీజేఎస్‌ నాయకులు మాత్రం సంబురాల్లో మునిగిపోయారు.

ఢిల్లీలో ఏం జరుగుతోంది...
గత ఎన్నికల తప్పిదాలను పునరావృతం చేయొద్దని గెలుపు గుర్రాలకే టికెట్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే రాహుల్‌గాంధీ తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేపించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు వయసు పైబడిన వారి జాబితాను టీపీసీసీ నుంచి రాహుల్‌ గాంధీ ఇటీవల తీసుకున్నారు. ఈ జాబితాలో పొన్నాల లక్ష్మయ్య పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ముందే గ్రహించిన పొన్నాల లక్ష్మయ్య పది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీని కలిసి వచ్చినట్లు సమాచారం. టికెట్‌పై రాహుల్‌తో హామీ తీసుకున్నాకే నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

తిరుగులేని నేత నుంచి...
జనగామ నియోజకవర్గం నుంచి పొన్నాల లక్ష్మయ్య నాలుగుసార్లు విజయం సాధించారు. 1994లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ అధిష్టానం నియమించింది. పొన్నాల నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపాలు కావడమేగాక పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న పొన్నాల సైతం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం తప్పించింది. ప్రస్తుతం మహాకూటమి ఏర్పాటు పొన్నాలకు తలనొప్పిగా మారింది.

ఆ సీటు ఎందుకు కోరుతుంది..?
టీజేఎస్‌ మొదటి నుంచి జనగామ సీటు కోరుతుందనే ప్రచారం సాగుతోంది. ప్రత్యేక జిల్లా ఉద్యమం జనగామలో భారీ ఎత్తున జరిగింది. హామీ ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో జిల్లా అంతా ఏకతాటిపై నిలిచింది. రోజుకో వినూత్న కార్యక్రమం, నిరసనలతో హోరెత్తింది. దీనికి జేఏసీ నాయకత్వం వహించింది. ఆఖరికి తలొగ్గిన ప్రభుత్వం జిల్లా ఏర్పాటుకు అంగీకరించింది. ఇది జేఏసీ విజయంగా టీజేఎస్‌ భావిస్తోంది. దీనికి తోడు ఉద్యోగులు, నిరుద్యోగులతో జేఏసీగా కోదండరామ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జనగామ సీటుపై కోదండరాం కన్నేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ రోజు సాయంత్రం వరకు ఉత్కంఠకు తెరపడనుంది.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top