ఓట్లేనా.. సమస్యలు పట్టవా..? | problems of kerameri mandal peoples | Sakshi
Sakshi News home page

ఓట్లేనా.. సమస్యలు పట్టవా..?

Oct 15 2014 2:15 AM | Updated on Oct 8 2018 6:18 PM

ఓట్లేనా.. సమస్యలు పట్టవా..? - Sakshi

ఓట్లేనా.. సమస్యలు పట్టవా..?

రెండు రాష్ట్రాలు. ఇటు తెలంగాణ.. అటు మహారాష్ట్ర. ఈ రెండు ప్రభుత్వాలు సరిహద్దులో ఉన్న కెరమెరి మండలంలోని వివాదాస్పద 14 గ్రామాలను ఏళ్ల తరబడి పాలిస్తున్నాయి.

కెరమెరి : రెండు రాష్ట్రాలు. ఇటు తెలంగాణ.. అటు మహారాష్ట్ర. ఈ రెండు ప్రభుత్వాలు సరిహద్దులో ఉన్న కెరమెరి మండలంలోని వివాదాస్పద 14 గ్రామాలను ఏళ్ల తరబడి పాలిస్తున్నాయి. అయినా ఆయా గ్రామాల ప్రజల కష్టాలు తీరడంలేదు. తాగునీరు, రోడ్లు, రవాణా తదితర సౌకర్యాలకు నోచుకోవడంలేదు. ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపుతుండడంతో ఏ గ్రామాన్ని కదిలించినా కన్నీటి గాథలే. ఎన్నికల వేళ వాగ్దానాలు గుప్పించి ఇరు ప్రభుత్వాలు ఓట్లు వేయించుకుంటున్నాయే తప్ప గ్రామాల అభివృద్ధి.. ప్రజల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. బుధవారం మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజూరా నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా

గ్రామాల సమస్యలపై..14 గ్రామాలు..
కెరమెరి మండలం పరందోళి, అంతాపూర్ పంచాయతీల పరిధిలోని పరందోళి, కోటా, పరందోళి తండా, ముకద్దంగూడ, మహరాజ్‌గూడ, లేండిజాల, అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఎసాపూర్, నారాయణగూడ, బోలాపటార్, లేండిగూడ, గౌరి గ్రామాలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఈ గ్రామాల్లో సుమారు నాలుగు వేల జనాభా, 2658 మంది ఓటర్లున్నారు. ఈ 14 గ్రామాలు మహారాష్ట్రలో రాజూరా నియోజకవర్గ పరిధిలోకి.. తెలంగాణలో ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్ 10న మహారాష్ట్రలో ఎంపీ ఎన్నికలు జరగగా.. 11న కెరమెరి మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఆయా గ్రామస్తులు ఇరు ప్రభుత్వాలకూ ఓట్లు వేశారు. ఐదు నెలల తర్వాత మళ్లీ మహారాష్ట్రలో బుధవారం జరిగే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధమవుతున్నారు.

అభివృద్ధి అంతంతే..
ఆయా గ్రామాలకు రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీ సభ్యు లు ఉన్నారు. ప్రతీ కుటుంబం రెండేసి రేషన్‌కార్డులు, ప్రతిఒక్కరూ రెండేసి ఓటరు కార్డు లు కలిగి ఉన్నారు. పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు రెండేసి ఉన్నాయి. ఇరు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అవి వారి దరిచేరడంలేదు. ఏ గ్రామానికి రోడ్డు, రవాణా సౌకర్యం లేదు. అనేక గ్రామాల్లో తాగునీటి పథకాలు పని చేయడంలేదు. భూగర్భజలాలు ఇంకిపోతుండడంతో చేతిపంపులు నిరుపయోగంగా మారాయి.

జనం దాహార్తితో అల మటిస్తున్నారు. కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి ఊటబావులు, చెరువుల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. నేటికి ఆయా గ్రా మాలకు వెళ్లాలంటే పిల్లదారులు, కచ్చారోడ్లే శరణ్యం. చాలా గ్రామాల్లో ఇందిరమ్మ గృహా లు మంజూరు కాలేదు. పరందోళిలో కొందరి కి మంజూరైనా దళారులు ఇల్లు నిర్మించకుం డానే లబ్ధిదారులకు తెలవకుండా బిల్లులు స్వాహా చేశారు. ఏళ్లుగా భూములు సాగు చేస్తున్నా పట్టాలు మాత్రం ఇవ్వడంలేదు.
 
విద్యుత్ ఉన్నా లేనట్లే..
ఆయా గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం ఉన్నా లేనట్లే. లేండిగూడలో మూడేళ్ల క్రి తం మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్ప్‌ఫార్మర్‌కు నేటికీ కనెక్షన్ ఇవ్వలేదు. కెరమెరి నుం చి విద్యుత్ సరఫరా ఉన్నా నెల లో వారం రోజులైనా కరెంటు ఉండదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇక రాత్రివేళ వారి కష్టాలు వర్ణనాతీతం. అయినా బిల్లులు మాత్రం ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
 
ఇద్దరే అభ్యర్థుల ప్రచారం
ఆయా గ్రామాలకు చెందిన రాజూరా నియోజకవర్గం నుంచి 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఇప్పటి వరకు ఇద్దరు అభ్యర్థులే ఆయా గ్రామాల్లో ప్రచారం చేశారని, మిగతా అభ్యర్థుల తరఫున వారి కార్యకర్తలే ప్రచారం నిర్వహించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇకనైనా నాయకులు తమ కష్టాలు తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement