రైతు బజార్‌ని పట్టించుకునేవారే కరువయ్యారు

Problems Of Nizamabad Rythu Bazaar - Sakshi

సమస్యలకు నిలయాలుగా రైతు బజార్లు

స్పందించని జిల్లా మార్కెటింగ్‌ అధికారులు

సాక్షి, నిజామాబాద్‌ అగ్రికల్చర్‌: రైతులు పండించిన కూరగాయలు విక్రయించేందుకు కోసం నిర్మించిన రైతుబజార్లు నిరుపయోగంగా మారాయి. అక్కడ రైతులకు కనీస వసతులు కల్పించకపోవడంతో అసౌకర్యాలకు గురవుతున్నారు. తద్వారా రైతుబజార్లలో కూరగాయలు విక్రయించేందుకు రైతులు నిరాసక్తత చూపుతున్నారు. దీంతో వీక్లీ మార్కెట్‌ చౌరస్తా, గాంధీగంజ్, వినాయక్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీ చౌరస్తా, కంఠేశ్వర్, ఇలా రోడ్లపై కూర్చొని విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా మార్కెటింగ్‌ అధికారులు స్పందించి నగరంలో ఎక్కడా కూరగాయలు విక్రయించకుండా చర్యలు చేపట్టి.. రైతుబజార్లను ఉపయోగంలోకి తేవాలని నగరప్రజలు కోరుతున్నారు.

కూరగాయల రైతుల సౌకర్యార్థం నగరంలో 2000 సంవత్సరంలో సుభాష్‌నగర్, పులాంగ్‌ వద్ద రైతుబజార్లను నిర్మించారు. ప్రతిరోజు వివిధ గ్రామాల నుంచి వచ్చే కూరగాయల రైతులందరూ అక్కడికి వచ్చి విక్రయించుకునే వీలు కల్పించారు. మొదట్లో అన్ని సౌకర్యాలు కల్పించడంతో అక్కడ కూరగాయలు విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపారు. తర్వాత కాలంలో వాటి నిర్వహణను గాలికొదిలేశారు. కనీసం అక్కడ మరుగుదొడ్లు, మూత్రశాలలు, తదితర నిర్వహణ సక్రమంగా చేపట్టలేదు. ఇటీవల కాలంలో రైతుబజార్ల మరమ్మతు పనులకు రూ.10లక్షలు వెచ్చించారు. మరమ్మతులు, బోర్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లకు ఖర్చుచేసి కొద్దో.. గొప్పో సౌకర్యాలను మెరుగుపర్చారు.

శాఖల మధ్య సమన్వయలోపం.. 
నిత్యం సుమారు 200మంది రైతులు నిజామాబాద్‌ రూరల్, మోపాల్, ఇందల్వాయి, గాంధారి, మాక్లూర్, ఆర్మూర్, తదితర మండలాల నుంచి రైతులు వచ్చి నగరంలోని రోడ్లపై కూరగాయలను విక్రయిస్తారు. ఇదే అదనుగా భావించి మున్సిపాలిటీ అధికారులు రూ.20చొప్పున తైబజార్‌ పేరుతో వసూలు చేస్తున్నారు. రోడ్లపై కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ విషయంలో శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. మున్సిపాలిటీ వారు తైబజార్‌ వసూలు చేయడం, ట్రాఫిక్‌ పోలీసులు మామూళ్ల మత్తులో మునిగిపోవడంతో మార్కెటింగ్‌శాఖ అధికారులు ఏం చేయలేక చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నా రు. ఈక్రమంలో రైతుబజార్లలో ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఫలితం లేకుండా పోతోంది.

మార్కెటింగ్‌ అధికారులే చొరవ తీసుకోవాలి.. 
రైతుబజార్లను వినియోగంలోకి తీసుకొచ్చే విషయంలో మార్కెటింగ్‌శాఖ అధికారులే చొరవ తీసుకోవాలి. మున్సిపాలిటీ, మార్కెటింగ్‌శాఖ, ట్రాఫిక్‌ పోలీసులు సమన్వయపర్చాలి. నగరంలో ఎక్కడెక్కడ రోడ్లు, ప్రధానచౌరస్తాల్లో కూరగాయలు విక్రయిస్తున్నారో పరిశీలించి వారిని ఫులాంగ్, సుభాష్‌నగర్‌ వద్ద నిర్మించిన రైతుబజార్లలోకి తరలించాలి. జిల్లా మార్కెటింగ్‌ అధికారి నిర్లక్ష్యం వల్లే రైతుబజార్లు వృథాగా ఉంటున్నాయనే ఆరోపణలుసైతం వెల్లువెత్తుతున్నాయి.

వినియోగంలోకి తేవాలి
నగరంలో హోల్‌సేల్‌ మార్కెట్‌ను గాంధీగంజ్‌ నుంచి శ్రద్ధానంద్‌ గంజ్‌ ప్రాంతానికి తరలించారు. దీంతో నగర ప్రజలకు కొంత దూరభారం పెరిగింది. ఈక్రమంలో నగరంలో నిర్మించిన రైతుబజార్లను వినియోగంలోకి తెస్తే వి నియోగదారులకు మేలు జరుగుతోంది. నేరుగా రైతుల నుంచి తాజా కూరగాయలను కొనుగోలు చేయడంతోపాటు రోడ్లపై ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా ఉంటుంది.                 – యాదగిరి, కోటగల్లీ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top