పోతరాజుల పోసాని

Potharaju Family Special Story - Sakshi

వేషధారణలో వందేళ్లుగా రాణిస్తున్న కుటుంబం

సింహవాహినికి రక్షణగా నిలుస్తున్న వంశస్తులు

అమ్మవారి ఆశీర్వచనంతోనే అంటూ ఆనందం   

ఒళ్లంతా పసుపు.. కుంకుమలు.. చేతిలో చర్నాకోల.. కళ్లకు కాటుక. నోటిలో నిమ్మకాయలు.. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు.. బోనాల ఉత్సవాల్లో పోతరాజుల సందడి అంతా ఇంతా కాదు.  లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతరలో పోతరాజు వేషధారణలో పోసాని కుటుంబానికి వందేళ్ల చరిత్ర ఉంది. ఇప్పటికీ ఆ కుటుంబానికి చెందినవారే అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పోతరాజు వేషధారణతో అలరిస్తున్నారు.

చాంద్రాయణగుట్ట :మేకలబండకు చెందిన ‘పోసాని’ కుటుంబం నుంచి ఎనిమిది మంది పోతరాజు వేషధారణ వేశారు. 1908లో ఆలయంలో బోనాలు ప్రారంభమైన కొన్నేళ్ల నుంచే ఈ కుటుంబ సభ్యులు పోతరాజు వేషధారణ వేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇదే వంశానికి చెందిన నాలుగో తరం వారు వంశపారంపర్యంగా పోతరాజు వేషధారణలో కొనసాగుతున్నారు. పోసాని బాబయ్య అలియాస్‌ సింగారం బాబయ్యతో ఈ అంకానికి శ్రీకారం చుట్టారు. బాబయ్య తమ్ముడు ఎట్టయ్య, బాబయ్య కుమారుడు లింగమయ్య, లింగమయ్య తమ్ముడు సత్తయ్య, లింగమయ్య కుమారుడు బాబురావు, బాబురావు సోదరుడు సుధాకర్, హేమానంద్‌.. ఇలా ఇప్పటి వరకు ఏడుగురు ఒకే వంశం నుంచి పోతరాజు వేషధారణ వేశారు. 2015 బోనాల నుంచి బాబురావు కుమారుడు పోసాని అశ్విన్‌ పోతరాజు వేషధారణ వేస్తున్నారు. పోసాని వంశం నుంచి మూడో తరానికి చెందిన బాబురావు 30 ఏళ్ల పాటు పోతరాజుగా తనదైన ముద్ర వేయడం గమనార్హం.   

అమ్మవారి ఆశీస్సులతోనే..
లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతోనే 30 ఏళ్ల పాటు పోతరాజుగా రాణించాను. దీంతో నన్నందరూ ‘పోతరాజు బాబురావు’ అని పిలుస్తుంటే ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంటుంది.
– పోతరాజు (పోసాని) బాబురావు  

ఎంతో సంతోషాన్నిచ్చింది..
నాలుగేళ్లుగా పోతరాజు వేషధారణ వేస్తున్నాను. ఘటస్థాపన రోజు నుంచి నియమ నిష్టలతో ఉంటూ అమ్మవారి ధ్యానంలో గడుపుతున్నాను. అమ్మవారి కరుణతోనే పోతరాజు వేసే అవకాశం దక్కిందని భావిస్తున్నా.   – పోసాని అశ్విన్, ప్రస్తుత పోతరాజు

పోతరాజు అంటే ఏమిటి..
పోతరాజంటే ఏడుగురు అక్కల ముద్దుల తమ్ముడు. అమ్మవారిని పొలిమేర నుంచి గ్రామంలోని దేవాలయానికి తీసుకొచ్చేటప్పుడు, అనంతరం సాగనంపేటప్పుడు రక్షణగా ముందు నడుస్తూ ఉంటాడు. డప్పు చప్పుళ్లకనుగుణంగా ఆనందంతో నృత్యం చేస్తూ స్వాగతిస్తుంటాడు. ఏడుగురు అక్కాచెల్లెళ్లు అయిన అమ్మవార్లకు ఈ పోతురాజంటే అమితానందం. దీంతో ఆయన సూచించిన రహదారిలో నడుస్తూ దేవాలయానికి తరలి వస్తారు. ఆయన గావుతో శాంతించి పొలిమేర దాటుతారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top