రెవెన్యూ లీలలు.. పేదలే సమిధలు

రెవెన్యూ లీలలు.. పేదలే సమిధలు - Sakshi


పరిగి: నిరుపేదలపై రెవెన్యూ అధికారులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకోవాలంటూ పట్టాలిచ్చిన రెవెన్యూ అధికారులే ఇప్పు సర్వే చేసి ఆ స్థలం ఖాళీ చేయాలంటున్నారు. కష్టపడి రెక్కలుముక్కలు చేసుకుని కట్టుకున్న ఇళ్లను ఇప్పుడు కూల్చేస్తామంటూ ప్లాట్లు లాక్కుంటామంటున్నారు.



పేదలకు పట్టాలిచ్చిన స్థలం జూనియర్ కళాశాలకు చెందినదంటూ సరిహద్దులు ఏర్పాటు చేస్తున్నారు. పేదల ఇళ్లు కూల్చేసి ఆ స్థలంలోంచి కళాశాల ప్రహరీ నిర్మిస్తామని సరిహద్దులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న 20 కుటుంబాలు, అక్కడ ప్లాట్లు పొందిన మరో వందకు పైగా కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.

 

రెవెన్యూ లీలల్లో సమిధలు కానున్న పేదబతుకులు..

పరిగికి కిలో మీటర్ దూరంలో ఆరు సంవత్సరాల క్రితం సర్వే నెంబర్:  530లోని 10 ఎకరాల భూమిలో 350 మందికి అప్పటి రెవెన్యూ అధికారులు పట్టాలిచ్చారు. ఆ కాలనీకి విద్యారణ్యపురి అని పేరుపెట్టగా ప్రస్తుతం 150 నుంచి 200 మంది వరకు అక్కడ ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు కిమ్మనని అధికారులు ఇప్పుడు అకస్మాత్తుగా పేదలకు పట్టాలిచ్చిన స్థలం జూనియర్ కళాశాలకు చెందినదని పేర్కొంటున్నారు. శుక్రవారం సర్వే నిర్వహించిన అధికారులు పేదలు ఇళ్లు నిర్మించుకున్న స్థలంలో రెండెకరాలు కళాశాల భూమి అని, అక్కడ ప్రహరీ నిర్మిస్తామని చెప్పి పేదల ఇళ్లలోంచి సరిహద్దులు ఏర్పాటు చేసి వెళ్లిపోయారు.

 

15 సంవత్సరాల క్రితం ఈ కళాశాలకు తొమ్మిది ఎకరాల స్థలం కేటాయించిన అధికారులు, ఆ తరువాత ఎనిమిదేళ్లకు ఇక్కడే పేదలకు పట్టాలిచ్చారు. అయితే ఇప్పుడు కళాశాలకు కేటాయించిన స్థలం ఏడెకరాలే ఉందని, మిగిలిన రెండు ఎకరాలను విద్యారణ్యపురి కాలనీ నుంచి స్వాధీనం చేసుకోనున్నట్లు చెప్పారు. రెవెన్యూ అధికారుల నిర్వాకంతో 20కిపైగా ఇళ్లతోపాటు 150 వరకు ప్లాట్లు, అక్కడ నిర్మించుకున్న ప్రార్థనా స్థలాలు కూల్చి వేసే పరిస్థతి తలెత్తింది.

 

ఈ విషయమై తహసీల్దార్ విజయ్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా.. అప్పట్లో అధికారులు అందుబాటులో ఉన్న స్థలాన్ని కచ్చితంగా అంచనా వేయకుండా పేదలకు స్థలాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు సర్వే చేస్తే అది కళాశాల స్థలం అని తేలిందని, అందుకే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోనున్నుట్ల తెలిపారు. మరోవైపు ఇక్కడ ప్లాట్లు పొందిన కుటుంబాలు ఇప్పుడు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. తమ ప్లాట్ల వద్దకు వస్తే ఉరుకునే పరిస్థితి లేదని హెచ్చరిస్తున్నారు.

 

రెక్కలు ముక్కలు చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నాం

ఏడేళ్ల క్రితం ఇక్కడ మాకు స్థలం కేటాయిస్తూ అప్పటి రెవెన్యూ అధికారులు పట్టా కాగితాలు ఇచ్చారు. ఆ తర్వాత బాగా కష్టపడి నాలుగేళ్ల క్రితం ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడేమో మేము ఇల్లు నిర్మించుకున్న స్థలం కళాశాలదని చెబుతున్నారు. అప్పుడు పట్టాలు వారే ఇచ్చి ఇప్పుడు మళ్లీ వారే లాక్కుంటామని చెబుతున్నారు. మాకు నష్టం కలిగిస్తే ఉరుకునే ప్రసక్తే లేదు.

 -ఎండీ అబ్దుల్ రషీద్, విద్యారణ్యపురి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top