‘వసూళ్లు’ ఆగేనా..?

Police Officials Corruption Strict Actions In Telangana - Sakshi

నిర్మల్‌ : పోలీసులు.. అంటే సమాజాన్ని తన కుటుంబంగా భావించి రక్షించేవారు. ఎన్ని ఆటంకాలొచ్చినా విధి నిర్వహణలో శాంతిభద్రతల కోసమే శ్రమించేవారు. ప్రజారక్షణలో ప్రాణాలను కూడా త్యాగం చేసిన పోలీసులూ ఉన్నారు. తెలం గాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసుగా ప్రజల్లో కలిసి పోయి సేవకులుగామారిన పోలీసులూ ఉన్నారు. కానీ కొంతమంది ‘వసూలు రాజా’లతో మొత్తం శాఖకే మచ్చ ఏర్పడుతోంది. ఇన్నేళ్లు కొంతమంది పోలీసులు గుట్టుగా సాగించిన మామూళ్ల దందా ఇటీవల బహిర్గతమైంది. రెండురోజుల క్రితం ‘వసూల్‌రాజా’ల జాబితా బయటపడడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. డీజీపీ విడుదల చేసినట్లుగా చెబుతున్న ఈ జాబితాలో జిల్లా నుంచి ఇద్దరు కానిస్టేబుళ్ల పేర్లు మాత్రమే ఉన్నాయి. కానీ.. జిల్లాలో ఇంకా చాలామంది ఇలా మామూళ్లు వసూలు చేసిచ్చే వాళ్లు ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎస్పీ సి.శశిధర్‌రాజు సీరియస్‌గా స్పందించారు. మామూళ్ల తీసుకోవడంతోపాటు ఇచ్చిన వారిపైనా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. 

కాదేదీ వసూళ్లకనర్హం..
ఇసుక, గుట్కా, గంజాయి అక్రమ రవాణా, పేకాట, మట్కా కేసులతో పాటు భార్యాభర్తలు, అన్నదమ్ములు, బంధువుల గొడవలు.. ఇలా ఏ సమస్య ఉన్నా.. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే పోలీసులూ ఉన్నారు. సమస్య పరిష్కరించాలం టూ వచ్చిన వాళ్ల నుంచి కాసులను రాబట్టిన సంఘటనలూ ఉన్నాయి. తమకు సంబంధం లేని వ్యవçహారాల్లోనూ తలదూర్చి పైసలు వసూలు చేసిన దాఖలాలూ గతంలో ఉన్నాయి. కొన్ని సంఘటనల్లో కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలోనే సమస్యలు పరిష్కరించేస్తుంటే.. మరికొన్ని కేసులు ఆపై స్థాయిలో ‘సెటిల్‌’ అవుతున్నాయి. 

మద్యం మస్తు..
జిల్లాలోని మద్యం దుకాణాలు పోలీసుశాఖకు ఆర్థిక వనరులుగా నిలుస్తున్నాయి. మద్యం వ్యా పారుల నుంచే పెద్దమొత్తంలో నెలసరి మామూళ్లు పోలీసులకు అందుతున్నాయి. పట్టణాల్లో రూ.10–15వేల మధ్య ఒక్కో మద్యం దుకాణం నుంచి మామూళ్లు అందుతున్నట్లు అంచనా. మండలాల్లోనూ ఇంచుమించు ఇదే స్థాయిలో వసూలు చేస్తున్నారు. కాస్త ఎక్కువ గిరాకీ ఉండే దుకాణం నుంచి ఎక్కువ మొత్తంలో మామూళ్లు రాబడుతున్నట్లు తెలిసింది. నెల కాగానే ఈ డబ్బులు సంబంధిత అధికారులకు చేరుతున్నాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే.. నిర్మల్‌లో మాత్రం ప్రత్యేకంగా స్టేషన్‌లలో ‘కలెక్టర్లు’, ‘వసూలు రాజా’లు లేరు. ఎప్పటికప్పుడు వేరే సిబ్బందితో ఈ కలెక్షన్‌ కొనసాగుతున్నట్లు తెలిసింది.

కాసులు కురిపిస్తున్న ఇసుక..
జిల్లాలో ప్రధానంగా ఇసుకదందా వ్యాపారులతో పాటు పోలీసు, రెవెన్యూశాఖలకూ కాసులు కురిపిస్తోంది. కళ్లెదుటే నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తుంటే.. తమకేం పట్టనట్లుగా సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నారు. పోలీసులు అడపాదడప ఒకట్రెండు ట్రాక్టర్లను పట్టుకోవడం, జరిమానాలు వేసి వదిలేయడం సర్వసాధారణంగా మారింది. ఈ తలప్పి ఎందుకన్నట్లుగా గ్రామాల్లో వేలం ద్వారా ఇసుక తవ్వకాలను దక్కించుకున్న వ్యాపారులు నేరుగా ఎస్సైలతోనే మాట్లాడుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ఇసుక మామూళ్లు పోలీసుశాఖతో పాటు రెవెన్యూ శాఖకూ ముడుతున్నట్లు సమాచారం.

సెటిల్‌మెంట్లు..
రూరల్‌పోలీస్‌ స్టేషన్‌లలో ఇసుకక్వారీలు ఆదాయ వనరులుగా మారితే.. పట్టణ పోలీస్‌స్టేషన్‌లలో కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, గొడవలు.. తదితర కొట్లాటల కేసులను సెటిల్‌ చేస్తూ కాసులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. భార్యాభర్తల గొడవల్లోనూ కౌన్సెలింగ్‌ల పేరిట పైసలు ఆశిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు కూడా నమోదు చేయకుండా కొంతమంది పోలీస్‌ అధికారులు సెటిల్‌మెంట్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. పట్టణ పోలీస్‌స్టేషన్‌లతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ‘ఆదాయం’ ఉన్నట్లు అంచనా. ఈక్రమంలో చాలామంది ఎస్సైలు తమకు రూరల్‌ ఏరియాలకే కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం.

‘మామూళ్లు’ ఆగేనా..
వైన్సులు, బార్లు, ఇసుక వ్యాపారులు, మట్కాజూదరులు, బంగారు దుకాణాలు, కల్లు సొసైటీలు.. తదితర వ్యాపార సంఘాలు, ఇతరత్రా పరిశ్రమల నుంచి నెలసరి మామూళ్లు అందుతున్న విషయం మొన్నటి జాబితాతో బహిర్గతమైంది. జిల్లాలోనూ ఈతంతు ఏళ్లుగా కొనసాగుతున్న విషయం కూడా బహిరంగ రహస్యమే. కానీ.. ఇటీవల డీజీపీ నిఘా వేయించి.. వసూలు రాజాల పేర్లు బయటపెట్టించినట్లు జాబితాతో సహా వచ్చింది. సదరు జాబితాలో జిల్లా నుంచి ఇద్దరు కానిస్టేబుళ్ల పేర్లు ఉండడంతో ఎస్పీ శశిధర్‌రాజు సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లాలో ఏస్థాయిలోనూ మామూళ్లు తీసుకోవడం, వసూలు చేయడం చేస్తే చర్యలు తప్పవన్నారు. మామూళ్లు తీసుకోవడంతో పాటు ఇచ్చేవారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈమేరకు జిల్లాలో మామూళ్ల పర్వం ఆగుతుందా.. జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసులుగా ఎన్నో మంచి పనులు చేపట్టిన పోలీసులపై పడ్డ ‘వసూళ్ల’ మచ్చ తొలగుతుందా.. వేచిచూడాల్సిందే.

తీసుకున్నా.. ఇచ్చినా చర్యలు
సమాజంలో శాంతిభద్రతల కోసం పోలీసుశాఖ శ్రమిస్తోంది. అవినీతికి తావులేకుండా వ్యవస్థ పనిచేస్తోంది. ఎవరైనా పోలీస్‌ అధికారులు, సిబ్బంది డబ్బులు అడిగినా.. వీరికి డబ్బులు ఇచ్చినా.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని హోటళ్లు, వైన్సులు, బార్, రెస్టారెంట్లు, లాడ్జీలు ఇతరత్రా వ్యాపారాల యజమానులు పోలీసులకు డబ్బులు ఇవ్వడం మానుకోవాలి. పోలీసులెవరైనా డబ్బులు అడిగితే 83339 86939 ఫోన్‌నంబర్‌కు మెసేజ్, లేదా వాట్సప్‌ చేయాలి.                     – సి.శశిధర్‌రాజు, ఎస్పీ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top