సంచలన విషయాలు: దిశ హత్యకు ముందు 9 హత్యలు

Police Investigation On Old Case On Disha Murder Accused - Sakshi

నిందితుల వాంగ్మూలంలో వెల్లడి

డీఎన్‌ఏ రిపోర్టులను పరిశీలిస్తున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ అత్యాచార, హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిశ హత్య కంటే ముందే నలుగురు నిందితులు మరో 9మంది మహిళలపై హత్యాచారం జరిపి, హత్య చేసినట్టుగా పోలీసుల విచారణ తేలింది. ఎన్‌కౌంటర్‌కు ముందు నిందితుల వాంగ్మూలంలో ఈ కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రధాన సూత్రధారి ఆరిఫ్‌ అలీ 6 హత్యలు.. చెన్నకేశవులు 3 హత్యలు చేసినట్లు అంగీకరించారని తెలుస్తోంది. ఈ హత్యలన్నీ మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, కర్ణాటక ప్రాంతాల్లోని హైవేల సమీపంలో చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారని పోలీసు వర్గాల సమాచారం. ప్రతి ఘటనలోనూ మహిళలపై అత్యాచారం, హత్య చేసి.. మృతదేహాలను దిశ మాదిరిగానే దహనం చేసినట్టు పోలీసుల ఎదుట నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో గతంలో జరిగిన హత్యలకు సంబంధించిన డీఎన్‌ఏ రిపోర్టులను పోలీసులు పరిశీస్తున్నారు. హైవేల పక్కన జరిగిన హత్యలపై ఆరా తీస్తున్నారు. దీని కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

దిశ కేసులో ఛార్జిషీట్ వేసే సమయానికి ఈ కేసులని చేధించాలని పోలీసులు చెబుతున్నారు. అయితే డీఎన్‌ఏ పరిశీలనలో భాగంగా పలు పాత కేసుల్లో ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్, ల డీఎన్ఏ లతో మరిన్ని హత్య కేసుల్లో మ్యాచ్ అవుతున్నట్లు సమాచారం. దీంతో విచారణను పోలీసులు మరింత వేగవంతం చేశారు. నిందితులు చెప్పిన సమాచారం ఆధారంగా ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు ఆధారాలు  సేకరిస్తున్నారు. నిందితులు డీఎన్‌ఏతో గత హత్యల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ​కాగా దిశ హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే.  ఎన్‌కౌంటర్‌పై కేసు కోర్టులో విచారణ జరుగుతుండటంతో మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top