
పోలవరం అంచనా వ్యయం మళ్లీ పెంపు!
పోలవరం ప్రాజెక్టు ముడుపుల పంచాయితీలో చిక్కుకుంది. ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ అంచనా వ్యయం మరోసారి పెంచి పంచుకోవడం...
* మాకెంత? మీకెంత?
* కాంట్రాక్టర్, ప్రభుత్వ పెద్దల మధ్య తేలని ముడుపుల లెక్కలు
* మరో రూ. 1000 కోట్లు పెంపునకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు ముడుపుల పంచాయితీలో చిక్కుకుంది. ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ అంచనా వ్యయం మరోసారి పెంచి పంచుకోవడం ద్వారా ముడుపుల పంచాయితీకి తెర దించడానికి రంగం సిద్ధమయింది. అంచనా వ్యయం రూ. మూడు వేల కోట్లు పెంచిన నేపథ్యంలో.. ముడుపులు ఎవరికెంత అనే విషయంలో ప్రధాన కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్లు, ప్రభుత్వ పెద్దల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో.. అంచనా వ్యయాన్ని మరింతగా పెంచి పంచుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టు సంస్థలు కలిసి కొల్లగొట్టడానికి వీలుగా పోలవరం హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ. 4050 కోట్ల నుంచి రూ. 6,961.70 కోట్లకు పెంచిన విషయం తెలిసిందే. మరోసారి అంచనా వ్యయాన్ని సవరించి రూ. ఎనిమిది వేల కోట్లకు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాల సమచారం.
సబ్ కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు.. : అంచనా వ్యయం పెంచిన తర్వాతే అసలు కథ మొదలయింది. దీనికి ముందు మాట్లాడుకున్న విధంగా ప్రభుత్వ పెద్దలకు ముడుపులు పంపిణీకి ట్రాన్స్‌ట్రాయ్ నిరాకరించింది. మొత్తం ప్రాజెక్టు పనులన్నీ తమ కంపెనీ ద్వారానే జరుగుతాయనే ఉద్దేశంతో భారీగా ముడుపులు ఇవ్వడానికి సిద్ధమయ్యామని, ఎస్క్రో ఖాతాలు తెరిచి సబ్ కాంట్రాక్టర్లుగా రంగంలోకి దిగిన బావర్, ఎల్‌అండ్‌టీకి నేరుగా చెల్లింపులు చేస్తే తమకు భారీగా సొమ్ము మిగలదని, ముడుపులు కూడా ఇవ్వనని ట్రాన్స్‌ట్రాయ్ ప్రతినిధులు ప్రభుత్వ పెద్దలకు తేల్చి చెప్పారు. సబ్ కాంట్రాక్టర్లు కూడా భారీగా ముడుపులు ముట్టజెప్పాలంటే.. ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో అంచనా వ్యయాన్ని మరో రూ. 1000 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని జల వనరుల శాఖలో ప్రచారం జరుగుతోంది.