అడవి పందులను చంపటం నేరం కాదు

pocharam clarifies on wild pig problems in rural areas - Sakshi

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం

సాక్షి, హైదరాబాద్‌: పంటను నాశనం చేసే అడవి పందులను చంపడం నేరం కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శాసనసభలో ప్రకటించారు. గతంలో అడవి పందులను చంపితే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసేవాళ్లమని, ఇకపై రైతులు వాటిని చంపటం నేరం కాదని పేర్కొన్నారు. వన్యప్రాణుల మూలంగా పంటలు నష్టపోకుండా నివారణ చర్యలు ఏమైనా తీసుకున్నారా.. అని సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా సమాధానమిచ్చారు.

అక్కడక్కడా కోతులు, అడవిపందులు పంటలను ధ్వంసం చేస్తున్నాయని, వాటిని నిర్మూలించేందుకు ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తోందని చెప్పారు. గతంతో కొండెంగలను వదిలితే కోతులు పారిపోయేవని, కానీ ఇప్పుడు వాటి మధ్య దోస్తీ కుదిరిందని చమత్కరించారు. బయోమెడిసిన్‌ ద్వారా కోతులు, అడవిపందుల్లో పునరుత్పత్తి నియంత్రించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని అన్నారు. కల్తీ రసాయనాలు, నకిలీ విత్తన నియంత్రణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పోచారం స్పందిస్తూ నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ చట్టం ప్రయోగించే విధంగా చట్టం తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 2.37 లక్షల నకిలీ విత్తన ప్యాకెట్లను సీజ్‌ చేసి ఇద్దరిపై పీడీ చట్టం ప్రయోగించినట్లు  చెప్పారు. 

ఈ సమావేశాల్లోనే విత్తన చట్టం: పోచారం
ప్రస్తుతం ఆర్డినెన్స్‌గా ఉన్న విత్తన చట్టాన్ని ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ అంశంపై లఘు ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ వచ్చే ఏడాది నుంచి దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో సీజన్‌కు రైతుకు పెట్టుబడిగా ఎకరాకు రూ. 4,000 అందిస్తామన్నారు. పంటలు వేసుకునే సమయాలను మార్చాలని నిర్ణయించామన్నారు. అందుకోసం వ్యవ సాయశాఖ కసరత్తు చేస్తుందన్నారు. రైతు యూనిట్‌గా బీమా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ రెండోసారి తీర్మానం చేస్తామన్నారు. ఖమ్మంలో మిర్చి రైతులపై కేసులను ఎత్తేయాలని కాంగ్రెస్‌ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేయగా ఆ అంశం తన పరిధిలోనిది కాదని, తాను కూడా çహోంమంత్రిని ఇదే కోరుతున్నానన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top