అండర్‌ టన్నెల్‌ వివరాలివ్వండి


కాళేశ్వరంపై రాష్ట్రానికి ఎన్జీటీ ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ:
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగ మార్గం (అండర్‌ టన్నెల్‌) వివరాలను అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ ఎన్జీటీలో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ జావేద్‌ రహీం నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. ఈ ప్రాజెక్టు పూర్తిగా తాగునీటి ప్రాజెక్టని, దీని నిర్మాణానికి అనుమతులు అవ సరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు. ఈ ప్రాజెక్టు ద్వారా అవసరమైతే పక్క రాష్ట్రాలకూ తాగునీటిని అందిస్తామని వెల్లడించారు.


ఈ ప్రాజెక్టుకు పూర్తి అనుమతులు వచ్చాక వీలైతే సాగునీటి అవసరాలకు వినియోగిస్తాము తప్ప ప్రస్తుతానికి ఇది తాగునీటి ప్రాజెక్టేనని వాదించారు. దీన్ని అటవీ భూముల్లో నిర్మిస్తున్నారని, సొరంగ మార్గ నిర్మాణం కూడా అక్కడే జరుగు తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్‌ ఉపాధ్యాయ వాదించారు. సొరంగం నిర్మించే క్రమంలో బుధవారం పైకప్పు కూలి ఏడుగురు మృతి చెందారని ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి అనుమతులు వచ్చే దాకా ప్రాజెక్టు నిర్మాణంపై స్టే విధించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సొరంగ మార్గం నిర్మాణంపై పూర్తి వివరాలను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడంతో ట్రిబ్యునల్‌ అందుకు అంగీకరించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 3కు వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top