జిల్లాలో చాలా సంవత్సరాలకు గ్రామ పంచాయతీల్లో ప్రక్షాళన జరగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పంచాయతీలపై దృష్టి సారించారు.
ఇందూరు : జిల్లాలో చాలా సంవత్సరాలకు గ్రామ పంచాయతీల్లో ప్రక్షాళన జరగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పంచాయతీలపై దృష్టి సారించా రు. ఇందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అ ధికారులతో ఈనెల 10వ తేదీన ప్రత్యేకంగా సమీక్షించారు. రాజ్యంగం ప్రకారం పంచాయతీల అధికారాలు మారుద్దామని, వాటికున్న అధికారాలేంటో.. ప్రజలకు ఎలా వినియోగం అవుతున్నాయో తెలపాలని అధికారులకు సూచించారు. కాగా పంచాయతీలపై జవాబుదారీతనం పెంచడానికి, వాటి రూపు రేఖలు మార్చేందుకు చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.
దీంతో జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు రాష్ర్ట అధికారులు పంచాయతీల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే పంచాయతీల్లో జరిగే ఈ ప్రక్షాళనతో చాలా మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో పంచాయతీల అధికారాలు బదలాయింపు కానున్నాయి. అలాగే ప్రాథమిక విద్య కూడా పంచాయతీల పరిధిలోకి తీసుకురానున్నారు. గ్రామాల అభివృద్ధి బాధ్యతను పంచాయతీలకు అప్పగించి ప్రజలకు జవాబుదారీతనంగా పని చేయించడానికి చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 718 గ్రామ పంచాయతీలుండగా, 400లకు పైగా క్లస్టర్లున్నాయి. పంచాయతీలకు 25 నుంచి 30 అధికారాలున్నాయి. వాటిలో చేర్పులు, మార్పులు జరిగే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి.
ఫిల్టర్ వాటర్ కోసం ప్రణాళిక
గ్రామాల్లో తాగునీటి సమస్యలతోపాటు సురక్షిత నీరు అందనుంది. ప్రజలకు తాగునీటి సమస్య నుంచి వెసులుబాటు కల్పించి ఫిల్టర్ వాటర్‌ను అందించేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రణాళిక తయారు చేస్తున్నారు. రక్షిత మంచి నీరు అందించేందుకు పంచాయతీ ఆధ్వర్యంలోనే ఆర్వో పాట్లు ఏర్పాటు కానున్నాయి. వాటిని ప్రజలకు ఉచితంగా అందజేయనున్నారు. అదేవిధంగా అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యంతోపాటు, పంచాయతీల్లో కంప్యూటరీకరణ చేపట్టడానికి అవసరమైన ప్రాణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ పాటికే జిల్లాలో పలు పంచాయతీకు ఈ- పంచాయతీ పేరిట కంప్యూటర్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఉపాధి హామీ పథకాన్ని గ్రామంలోని ప్రతి పేద కుంటుంబం ఉపయోగించుకుని ఉపాధి పొందేలా, గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచడానికి చర్యలు చేపట్టనున్నారు.
పంచాయతీ నుంచే ధ్రువపత్రాలు
ప్రస్తుతం ఎలాంటి ధ్రువ పత్రాలైన మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల నుంచి పొందుతున్నాం. కానీ పంచాయతీ స్థాయి ధ్రువ పత్రాలు పంచాయతీలోనే పొందడానికి పంచాయతీరాజ్ శాఖ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మీ-సేవ కేంద్రాల ద్వారా పంచాయతీలకు సంబంధించిన ధ్రువ పత్రాలను పొందాలంటే ప్రజలు వారం పది రోజులు వేచి చూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో చిన్నపాటి పుట్టిన రోజు, మరణ, కుల, ఆదాయ, లోకల్ క్యాండెట్, తదితర ధృవ పత్రాలను ఒక్క రోజులో పొందేలా పంచాయతీల ద్వారా ధ్రువ పత్రాలను అందజేయాడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. త్వరలోనే పంచాయతీల ద్వారా పలు ధ్రువ పత్రాలు అందజేయనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారుల వర్గాలు పేర్కొంటున్నాయి.