పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయండి

Petition Filed In Supreme Court On Disha Accused Encounter - Sakshi

సుప్రీం మార్గదర్శకాలు పాటించలేదు

సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై పలవురు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు నిందితులపై జరిపిన ఎన్‌కౌంటర్‌లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించాలని న్యాయవాదులు జీఎస్‌ గనీ, ప్రదీప్‌ కుమార్‌లు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఎన్‌కౌంటర్‌ జరిపిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ సందర్భంగా 2014లో అత్యున్నత న్యాయస్థానం రూపొందించిన మార్గదర్శకాలను పోలీసులు విస్మరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఎన్‌కౌంటర్‌ ఉదంతానికి సంబంధించి శుక్రవారం షాద్‌ నగర్‌ పోలీసులు ఇదివరకే కేసు నమోదు చేశారు. దిశ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న షాద్‌ నగర్‌ ఏసీపీ వి.సురేంద్ర ఫిర్యాదు మేరకు హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్‌ 307) కింద కేసు నమోదు చేశారు. ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు కూడా విచారణ ప్రారంభించారు.

మరోవైపు తెలంగాణ పోలీసులు దిశ నిందితులపై జరిపిన ఎన్‌కౌంటర్‌ను బాధిత కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చట్ట ప్రకారం శిక్షించకుండా అన్యాయంగా కాల్చిచంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎన్‌కౌంటర్‌ జరిగిన అనంతరం ప్రక్రియలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు గతంలో అభిప్రాయపడింది. దీని కొరకు ఐదేళ్ల కిందట పలు మార్గదర్శకాలను రూపిందించింది. వీటిని తప్పక పాటించాలని ఆదేశాలు జారీచేసింది.

ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు..
1) సంఘటన స్థలంలో నిందితులు సంచరిస్తున్నారన్న సమాచారాన్ని వెంటనే రికార్టు చేయాలి.
2)ఎన్‌కౌంటర్‌ మరణాలకు తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. దాన్ని అన్నికేసుల్లాగే కోర్టుకు పంపించాలి.
3) పోలీసు దర్యాప్తునకు సమాంతరంగా సీఐడీ దర్యాప్తు చేయాలి. పోస్ట్‌మార్టం కార్యక్రమాన్ని వీడియో తీయాలి.
4) మెజిస్టీరియల్‌ దర్యాప్తు జరపాలి.
5) ఎన్‌కౌంటర్‌ జరిగిన సమాచారాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఇవ్వాలి.
6) ఎఫ్‌ఐఆర్‌ను, డైరీ ఎంట్రీలను, పంచనామాలను, ఇతర సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా కోర్టుకు సమర్పించాలి.
7) వేగంగా అభియోగపత్రం నమోదు చేయాలి.
8) రాష్ట్రంలో జరిగిన ఇలాంటి అన్ని ఎన్‌కౌంటర్లపై ఆర్నెల్లకు ఒకసారి ఎన్‌హెచ్‌ఆర్‌సీకి నివేదిక పంపాలి.
11) పోలీసులు తప్పుచేసి ఉంటే చర్యలు తీసుకోవాలి.
12) మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి.
13) ఎన్‌కౌంటర్‌ కాగానే పోలీసులకు అవార్డులు ఇవ్వడం మానుకోవాలి. అన్ని అనుమానాలు నివృత్తి అయ్యాకే వారిని అవార్డులకు పరిశీలించాలి.
14)ఘటనపై బాధిత కుటుబాలకు వెంటనే సమాచారం ఇవ్వాలి
15) ఎన్‌కౌంటర్‌ జరిగిన వెంటనే పోలీసులు తుపాకీలను పై అధికారుల ముందు సరెండర్‌ చేయాలి.
16) ఘటనపై విచారణకు డిమాండ్‌ చేస్తూ.. బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top