ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న హరీష్ రాణాకు లైఫ్ సపోర్ట్ ఉపసంహరించాలా? కారుణ్య మరణానికి (పాసివ్ యూతనేషియా) అనుమతించాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ సుప్రీం లైఫ్ సపోర్ట్ చికిత్స ఉపసంహరణకు ఆమోదిస్తే.. 2018లో చట్టబద్దత తర్వాత మన దేశంలో పరోక్ష కారుణ్య మరణం జరిగిన మొదటి కేసు ఇది అవుతుంది.
కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే..
ఆగస్టు 20,2013. రాఖీ పండుగ. చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న హరీష్ తన హాస్టల్ నాలుగవ అంతస్తు బాల్కనీ నుంచి కింద పడ్డాడు.ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైకల్యం ఏర్పడింది. హరీష్‌కు చికిత్స చేసిన వైద్యుడు మొదట్లో అతను కళ్ళు తెరవలేకపోయాడని, అవయవాలను కదల్చలేకపోయాడని చెప్పాడు. అప్పటి నుండి, హరీష్ శాశ్వతంగా మంచానికే పరిమితమయ్యాడు.
ఓ వైపు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న హరీష్ రాణా కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. హరీష్ రాణాకు ఇద్దరు తోబుట్టువులు. వారి సంరక్షణ కోసం ఢిల్లీలోని మహావీర్ ఎన్‌క్లేవ్‌లోని తమ ఇంటిని అమ్మేసి ఘజియాబాద్‌కు మకాం మార్చారు.
రోజులు, నెలలు,సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ హరీష్ ఆరోగ్యం కుదట పడలేదు. దీంతో చేసేది లేక తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా.. జూలై 2024లో కారుణ్య మరణం కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు హరీష్ వెంటిలేటర్‌పై ఆధారపడటం లేదని, కేవలం ట్రాకియోస్టమీ ట్యూబ్ (శ్వాస కోసం), గాస్ట్రోస్టమీ ట్యూబ్ (ఆహారం కోసం) వాడుతున్నాడని పేర్కొంది. ఫీడింగ్ ట్యూబ్ తొలగిస్తే ఆకలితో మరణం సంభవిస్తుందని, అది యాక్టివ్ యూతనేషియా అవుతుందని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రుల అభ్యర్థనను తిరస్కరించింది.
నవంబర్ 2024 అప్పటి సీజేఐ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్, హరీష్ పూర్తిగా లైఫ్ సపోర్ట్‌పై ఆధారపడటం లేదని పేర్కొంది. అయితే, కేంద్రం హరీష్ చికిత్స, వసతి కోసం ఏర్పాట్లు చేయాలని సూచించింది.
డిసెంబర్ 2025
సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్రం హరీష్‌కు చికిత్స అందిస్తుంది. ప్రైమరీ, సెకండరీ మెడికల్ బోర్డులు హరీష్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతుందని, కోలుకునే అవకాశం చాలా తక్కువేనని నివేదించాయి. మెడికల్ రిపోర్టులపై జస్టిస్ జేబీ పార్థీవాలా ధర్మాసనం.. ఇది చాలా బాధాకరమైన నివేదిక. హరీష్‌ను ఇలాగే ఉంచలేం’ అని అన్నారు.తీర్పును నేటికి (జనవరి16,2026) వాయిదా వేశారు. జనవరి 13న న్యాయమూర్తులు హరీష్ తల్లిదండ్రులను కలుసుకుని వారి వేదనను విన్నారు. ఇవాళ హరీష్ కేసులో తీర్పును వెలువరించనుంది. ఇది దేశంలో పాసివ్ యూతనేషియా చరిత్రలో కీలక మలుపు అవుతుంది.


