చదివింది ఏడు.. చేస్తుంది ఫ్రాడ్‌

Person Doing Fraud By Taking Pension Account Numbers In Sircilla - Sakshi

సాక్షి, సిరిసిల్ల : ఉన్నత చదువులు చదివి పంచాయతీ కార్యాలయంలో పింఛన్లు రానివారికి పునరుద్ధరించడానికి అధికారులు తలమునకలు అవుతుంటే.. ఏడో తరగతి చదివిన బీడీ కార్మికుడు ఫ్రాడ్‌ నంబర్లతో పింఛన్‌దారుల సొమ్మును తన అకౌంట్లో వేసుకున్న తతంగం గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.ఎంపీడీవో కార్యాలయం అధికారుల వివరాల ప్రకారం.. బీర్‌పూర్‌ మండలం కొల్వాయికి చెందిన సత్యనారాయణ అనే బీడీ కార్మికుడు రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్‌ పరిధిలోని చంద్రంపేట వృద్ధుల పింఛన్లను మూడు నెలలుగా స్వాహా చేస్తున్నాడు.

ఈ తతంగమంతా పింఛన్‌ విభాగంలో కంప్యూటర్‌ విధులు నిర్వర్తిస్తున్న ఆపరేటర్ల సహాయంతో చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బాధిత వృద్ధులు తమకు డబ్బులు రావడం లేదని చెప్పడంతో అనుమానం వచ్చిన అధికారులు సంబంధిత వివరాలను వెతికారు. ఈ క్రమంలోనే ఒక బ్యాంక్‌ ఖాతాలో మూడు నెలలుగా దాదాపు రూ.60వేలు పలువురివి పలు బ్యాంక్‌ నంబర్లలో జమ అవుతున్నట్లు ఎంపీడీవో కార్యాలయ అధికారులు గుర్తించారు.

బ్యాంక్‌ ఖాతాల వివరాల ప్రకారం ఏపీవో పింఛన్ల బాధ్యుడు పాపారావు, సత్యనారాయణ వివరాలను బ్యాంక్‌ నుంచి సేకరించి ఏలాగోలా సిరిసిల్లకు రప్పించాడు. పింఛన్లు స్వాహా చేయడానికి సత్యనారాయణ ఎన్నుకున్న విధానం, యూజర్‌నేమ్, పాస్‌వర్డులను తెలుసుకున్న విధానాలను అతడితోనే చెప్పించారు. పింఛన్‌ విభాగంలో పలువురు ప్రైవేటు ఆపరేటర్లు సమాచారాన్ని బయటకు ఇవ్వడంతోనే మోసాలు జరిగినట్లు చర్చ జరుగుతుంది. నిందితుడు సత్యనారాయణపై చర్యలకు వెళ్తున్నట్లు ఏపీవో పాపారావు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top