పోస్టింగ్‌ల కోసం ప్రదక్షిణలు!


సత్తుపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించనుంది...నూతన ప్రభుత్వమూ అధికారంలోకి రానుంది...ఇక మంచి పోస్టింగ్‌ల కోసం అధికారులు హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారపార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. పలువురు అధికారులు తమకు తెలిసిన టీఆర్‌ఎస్ నేతలను వెంటబెట్టుకొని అగ్రస్థాయి నేతల వద్దకు వెళ్లి తెలంగాణ ఉద్యమం, సకలజనుల సమ్మెలో ఎట్లా పని చేశామో ఏకరువు పెడుతూ తమ బయోడేటాలను  వాళ్ల ముందు ఉంచుతున్నారు.ఎన్నికల సంఘం నిబంధనలతో జిల్లాలో పనిచేస్తున్న తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఓలు ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. కొద్ది రోజుల్లో మళ్లీ జిల్లాకు వచ్చే అవకాశం ఉండటంతో  మంచి పోస్టింగ్‌ల కోసం పైరవీలు ప్రారంభించారు.  ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో ఆరాతీస్తూ... తమ పనిని చేయించుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పోలీస్ శాఖలో కూడా బదిలీలు జరగవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. జూన్ పది తరువాతనే....

 జూన్ 2 అపాయింటెడ్ డే రోజున కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పరిపాలనపై పూర్తి పట్టు సాధించేందుకు అధికార యంత్రాంగం కూర్పుపై ఆయన దృష్టిసారించే అవకాశం ఉంది. జూన్ 10వ తేదీ నుంచి ఇతర జిల్లాల్లో పని చేసిన అధికారులను సొంత జిల్లాలకు బదిలీపై తిరిగి పంపించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఈలోగానే తమతమ పరిచయాలతో మంచి పోస్టింగ్‌లు దక్కించుకునేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడకు బదిలీపై వచ్చిన అధికారులు కూడా ఆయా జిల్లాల్లో కలెక్టర్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అయితే వారిలో కొందరు అధికారులు ఈ జిల్లాలోనే పని చేసేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా  ప్రభుత్వ కార్యాలయాలలో ఇప్పుడు ఎక్కడ విన్నా బదిలీల మాటే.  ఎవరు ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతారు.. కొత్తవారు ఎవరు పోస్టింగ్ తెచ్చుకుంటారోనని చర్చలు జోరుగా సాగుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top