కిడ్నాపర్లను పట్టించిన ఏటీఎం

Peddapalli Police Who Caught Kidnappers Through an ATM - Sakshi

సూత్రధారుల్లో ఇద్దరు రైల్వే ఉద్యోగులు  

పెద్దపల్లి: ఖాజీపేట రైల్వే జంక్షన్‌లో సిగ్నల్‌ ఇంజినీర్లుగా పని చేస్తున్న గుండ రజని, గడ్డం ప్రవీణ్‌ ఇటుకబట్టీ వ్యాపారి సిద్ధయ్య కిడ్నాప్‌ వ్యవహారంలో సూత్రధారులుగా తేలారు. కిడ్నాప్‌కు సిగ్నల్‌ ఇచ్చింది ఆ ఇద్దరే ఏ1, ఏ2లుగా పేర్కొంటు పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌ ఇటుకబట్టీ వ్యాపారీ నల్లూరి సిద్ధయ్యను నవంబర్‌ 25న కిడ్నాప్‌ చేసిన ముఠాలోని ఏడుగురిలో ఆరుగురిని ఆరెస్టు చేశారు. పెద్దపల్లిలోని గౌరెడ్డిపేట రోడ్డుమార్గంలో ఉంటున్న గుండ రజని, గడ్డం ప్రవీణ్‌ రైల్వేశాఖలో ఉద్యోగాలు చేస్తున్నారు. జల్సాలకు అలవాటుపడి అప్పులపాలయ్యారు. ఈజీగా డబ్బు రాబట్టేందుకు సిద్ధయ్యను కిడ్నాప్‌ చేయడానికి పన్నాగం పన్నారు. రజని మేనమామ వేల్పుల తిరుపతి, సిద్ధయ్య వద్ద గుమాస్తాగా పని చేస్తుండడం, సిద్దయ్య వ్యాపార లావాదేవీల గురించి అవగాహన కలిగి ఉన్నాడు. సిద్దయ్యను కిడ్నాప్‌ చేస్తే పెద్దమొత్తంలో డబ్బు రాబట్టవచ్చని, రూ.కోటి వరకు గిట్టబాటవుతుందని భావించారు.

ప్రవీణ్‌ సోదరుడైన రమేశ్‌ సహకారంతో కిరీటీ, మున్నా, షేక్‌భాషా, షకీల్‌ కలిసి గతనెల 19న కిడ్నాప్‌కోసం ప్రయత్నించగా పోలీసులను చూసి అమలు చేయలేదు. అనంతరం ఇన్నోవా, టవేరా వాహనాల్లో బయలుదేరిన ముఠాసభ్యులు రెండుగా విడిపోయి కిడ్నాప్‌కు పాల్పడ్డారు. సిద్ధయ్యను వాహనంలో ఎక్కించుకొని బెదరించి రూ.8.5 లక్షలు వసూలు చేశారు. ప్రవీణ్, రజనీ, రమేశ్‌ తమను సిద్దయ్య గుర్తు పడతాడని రెండోవాహనంలో ఉండి ఆపరేషన్‌ను పూర్తి చేయించారు. రూ.కోటి కోసం డిమాండ్‌ చేయగా తన ఇంట్లో రూ.8లక్షలు మాత్రమే ఉన్నాయని, జేబులో రూ.50 వేలు, ఏటీఎంకార్డు, బంగారు ఉంగరాన్ని అప్పగించి క్షేమంగా ఇంటికి వెళ్లాడు. అదేరాత్రి ఒంటింగట సమయంలో సమాచారం తెలసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.
 
జాడచెప్పిన ఏటీఎం కార్డు..
ముసుగులు ధరించిన కిడ్నాపర్లు సెల్‌ఫోన్‌ ఉపయోగించకుండా పని పూర్తిచేసుకున్నారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తపడ్డారు. టోల్‌గేట్‌ దాటితే వాహనాలు రికార్డు అవుతాయని, గమనించిన కిడ్నాపర్లు సిద్దయ్య వద్ద ఉన్న ఏటీఎం కార్డు మాత్రం తీసుకెళ్లారు. దీంతో సిద్ధయ్యను పోలీసులు బ్యాంకు అకౌంట్లో మరింత డబ్బు వేయాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. పోలీసుల సూచన మేరకు తన అకౌంట్లో సిద్దయ్య డబ్బు వేస్తుండగా నిందితులు ఏటీఎం కార్డు ద్వారా పెట్రోల్, డీజీల్‌కు స్వైప్‌ను ఉపయోగించారు. సూర్యాపేటతోపాటు హైదరాబాద్, గోవాలో ఏటీఎంను ఉపయోగించడంతో అనుమానిత ప్రాంతాల్లో అప్పటికే పోలీసులు మాటు వేశారు. డబ్బు డ్రా అవుతున్నట్లు సిద్దయ్యకు మెసేజ్‌ వచ్చిన వెంటనే ముఠా సభ్యులను పట్టుకున్నారు. సూర్యాపేట వద్ద రూ.40 వేలు ఈనెల 26న డ్రా చేసిన నిందితులకు తిరిగి బ్యాంకు ఖాతాలో డబ్బుతో ఎరవేసి పట్టుకున్నారు. కాగా మంగళవారం పెద్దపల్లి పట్టణ శివారులో నిందితులు వాహనాల్లో వెళ్తుండగా తనిఖీ చేసిన సమయాల్లో పట్టుబడ్డారని ప్రకటించారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top