మహారాష్ట్రలో మన మద్యం పట్టివేత

Our Liquor Caught in Maharashtra - Sakshi

అక్కడి లెక్కల ప్రకారం రూ.6,44,400 విలువ

రెండు రాష్ట్రాల్లోనూ ‘కోడ్‌’ ఉన్నా దర్జాగా తరలింపు

ఎన్నికల వేళ ఇదంతా ‘కామనే’ అంటూ స్థానికుల్లో చర్చ

బేల(ఆదిలాబాద్‌): బేల మండల కేంద్రానికి దగ్గర్లో ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చంద్రపూర్‌ జిల్లాలోని కోర్పణ పట్టణ సమీపంలోని సావల్‌హీర గ్రామ రోడ్డు మార్గంలో మన రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అక్కడి పోలీసులు పట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్లుగా మద్యపాన నిషేధం అమలులో ఉన్న చంద్రపూర్‌ జిల్లా సావల్‌హీర ప్రాంతం వైపు బేల మండలకేంద్రం నుంచి తరలిస్తుండగా తెలియవచ్చిన ఈ ఘటనపై స్థానికంగా రచ్చరచ్చ జరుగుతోంది.

అక్కడి లెక్కల ప్రకారం ఈ మద్యం విలువ రూ.6,44,400 ఉంటుందట! ఆరేడు నెలల నుంచి వారంలో ఒకట్రెండుసార్లు ఈ తరలింపు మాములేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్రలోనూ ఎన్నికల ఎలక్షన్‌ కోడ్‌ ఉండగానే ఈ అక్రమ తరలింపు జరగడం గమనార్హం!

పట్టుబడ్డ మద్యం వివరాలు

ఐబీ క్వాటర్లు 39 పెట్టెలు (1872క్వాటర్‌లు), రాయల్‌ స్టాగ్‌ ఫుల్‌బాటిళ్లు 20, ఐబీ ఫుల్‌బాటిళ్లు 24తోపాటు మరో 24 ఆఫ్‌ బాటిళ్ల రాయల్‌ స్టాగ్‌ మద్యాన్ని పట్టుకున్నారు. వీటి మొత్తం ఇక్కడి విలువ ప్రకారం రూ.2.86 లక్షలు కాగా, అక్కడి ప్రకారం రూ.6,44,400 ఉంటుందని ఓ మహా రాష్ట్ర పోలీసు అధికారి వెల్లడించారు.

మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారిలా..

బేల మండల కేంద్రంలోని రెండు వైన్సుల్లో నౌకరీనామాతో పని చేస్తున్న పలువురు ఎప్పటిలాగే ఈసారి మద్యాన్ని మండలంలోని చప్రాల, చంపె ల్లి, భవానీగూడ(సి) గ్రామాల మీదుగా మహారా ష్ట్రలోని తిప్ప, మాంగల్‌హీర, సావల్‌హీర ప్రాంతా నికి ఎంహెచ్‌ 04 ఈఎస్‌ 9510 నంబరు గల ప్రత్యేక టవేరా వాహనంలో గత సోమవారం రాత్రి పకడ్బందీగా తరలించారు. అయినా, ఈ సమాచారం ఎక్కడ లీకైందో గానీ పక్కా సమాచారం తెలుసుకున్న మహారాష్ట్రలోని కోర్పణ పోలీసులు మాంగల్‌హీర ప్రాంతంలో ఈ మద్యం వాహనాన్ని ఆపి తనిఖీ చేయడానికి ప్రయత్నించారు.

కానీ, ఆగకుండా వేగంగా దూసుకుపోవడంతో అధికారులు ఆ వాహనాన్ని వెంబడించా రు. ఈ క్రమంలో సావల్‌హీర ప్రాంతం సమీప రోడ్డు మార్గంలో గుంతలు తవ్వి ఉండడంతో, వాహనాన్ని వదిలేసి అందులో ఉన్నవారు పరారయ్యారు. దీంతో అధికారులు వాహనంతోపాటు అందులో తరలిస్తున్న మద్యాన్ని, వాహనంలో దొరికిన ఒక సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశారు. ఈ సంఘటనపై సదరు పోలీస్‌స్టేషన్‌ సీఐ కిశోర్‌కార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా అక్రమ మద్యాన్ని సీజ్‌ చేసి, కేసు నమోదు చేసినట్లు స్పస్టం చేశారు.

సీజ్‌ చేయబడిన మద్యం, సెల్‌ఫోన్, వాహనం విలువ మొత్తంగా రూ.11,45,400 ఉంటుందని ఆయన వివరించారు. ఈ మద్యం తరలింపుదారులు మా త్రం పరారయ్యారనీ, సీజ్‌ చేసి సెల్‌ఫోన్‌ డాటా అధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆ సీఐ వెల్లడించారు. ఫోన్‌ తాలుకు నిందితుడిని త్వరలోనే పట్టుకుని, తర్వాత మిగతా నిందితులను సైతం అరెస్టు చేస్తామని ఆయన పేర్కొన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top