కొత్త బ్యాంకు ఖాతా తప్పనిసరికాదు

Old account can be used for the Panchayat Election Cost - Sakshi

పంచాయతీ ఎన్నికల వ్యయానికి పాత ఖాతా వాడుకోవచ్చు

నిబంధనలు సడలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల కోసం పాత బ్యాంకు ఖాతానే వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు ఖాతా తెరిచి దాని ద్వారానే ఎన్నికల ఖర్చులు చేయాలన్న నిబంధనను ఎన్నికల సంఘం సడలించింది. అయితే నామినేషన్‌ దాఖలు సమయంలో పాత బ్యాంకు ఖాతా నంబర్‌ను రిటర్నింగ్‌ అధికారికి అందజేయడంతోపాటు నామినేషన్‌ దాఖ లు చేసిన తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సదరు ఖాతాను ఎన్నికల ఖర్చు కోసమే వినియోగిస్తామని ధ్రువీకరణ సమర్పించాలని తెలి పింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ శనివారం ప్రత్యేక సర్క్యులర్‌ జారీ చేశారు.

పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ దాఖలుకు కనీసం ఒకరోజు ముందు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి, ఆ ఖాతా వివరాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేయాలని, మొత్తం ఎన్నికల ఖర్చును ఈ ఖాతా ద్వారానే చేయాలని గతేడాది మే 18న రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్‌ జారీ చేసింది. కొత్త బ్యాంకు ఖాతా తెరవడానికి 10–15 రోజుల సమయం పడుతోందని, ఈ నిబంధనతో ఎన్నికల్లో పోటీ చేయలేమని కొందరు అభ్యర్థులు క్షేత్రస్థాయి అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొంతమంది జిల్లా కలెక్టర్లు ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి దృష్టికి తీసుకురాగా.. ఆయన స్పందించి తక్షణమే సడలింపు ఉత్తర్వులు జారీ చేశారు. 

జడ్పీటీసీ, ఎంపీటీసీలూ అర్హులే
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసేందుకు ఎంపీటీసీ, జడ్పీటీసీలు అర్హులేనని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఒకటి కంటే ఎక్కువ పదవులకు ఎన్నికైతే ఏదో ఒక పదవినే చేపట్టాల్సి ఉంటుందని, నిబంధనల ప్రకారం ఇతర పదవిని కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొం ది. పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల అర్హతల విషయంలో ఎన్నికల అధికారుల నుంచి వస్తున్న సందేహాలను నివృత్తి చేస్తూ ఆదివారం జిల్లా కలెక్టర్ల కు ఈ మేరకు లేఖ రాసింది.

ఒక అభ్యర్థి ఏకకాలంలో సర్పంచ్, వార్డు సభ్యుడి స్థానాలకు పోటీ చేయవచ్చని, ఒక వేళ ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే నిబంధనల ప్రకారం ఒక పదవిని మాత్రమే చేపట్టి ఇతర పదవిని వదులుకోవాల్సి ఉంటుందని తెలిపింది. పంచాయతీ ఎన్నికల్లో ఒకటి కంటే ఎక్కువ వార్డుల్లో, ఒకటి కంటే ఎక్కువ ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ఒక అభ్యర్థి పోటీ చేసేందుకు అవకాశం లేదని తేల్చి చెప్పింది. అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ వార్డులు/ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు నామినేషన్‌ దాఖలు చేయవచ్చని, నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా ఒకటి తప్ప మిగిలిన చోట్లలో వేసిన నామినేషన్లలను ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top