కలెక్టర్‌ చెప్పినా.. కాదు పొమ్మంటున్నారు

Officers Showing Negligency In Warangal - Sakshi

ఆదేశాలు పట్టించుకోని డీఆర్‌డీఓ అధికారులు

నెల దాటినా కదలని దివ్యాంగురాలి ఫైల్‌

సార్‌ చెప్పినట్టు ఇస్తే ఇబ్బందులొస్తాయంటూ కొత్త భాష్యం

సాక్షి, వరంగల్‌: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది జిల్లాలో డీఆర్‌డీఓ అధికారుల తీరు. 100 శాతం మానసిక వైకల్యంతో ఉన్న బాలికను చేతులపై మోసుకుని తల్లిదండ్రులు డిసెంబర్‌ 23న కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌కు వచ్చారు. ఏడాదిగా పింఛన్‌ రావడంలేదని, కార్యాలయాల చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు.

స్పందించిన కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సంబంధిత అధికారులతో మాట్లాడి పెండింగ్‌ పింఛన్‌ వెంటనే ఇవ్వడంతో పాటు ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌ పెన్షన్‌ ఇవ్వాలని ఆదేశించారు. అప్పుడు సరేనని చెప్పిన అధికారులు.. నెల రోజులు దాటినా పట్టించుకున్న పాపానపోలేదు. ఇదిగో.. అదిగో అంటూ దాటవేస్తున్నారు. ఇది ఒక బాలిక సమస్యే కాదు. జిల్లాలో అనేక మంది దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు.

హన్మకొండ అర్బన్‌: ఖిలా వరంగల్‌ ప్రాంతానికి చెందని కొప్పుల గణేష్‌ కూతురు వర్షిణి నూరు శాతం మానసిక దివ్యాంగురాలు. ఇందుకు సబంధించి అన్ని రకాల పత్రాలు, సదరం సర్టిఫికెట్‌ ఉండగా గతంలో ఆసరా పింఛన్‌ అందేది. పెన్షన్‌ 2019 జనవరి నుంచి ఆగిపోవడంతో పలుమార్లు కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌కు, డీఆర్‌డీఓ కార్యాలయంలో వినతులు అందజేసినా ఫలి తం కానరాలేదు. సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. త్వరలో పరిష్కరిస్తామని నాన్చుతున్నా రు.

డీఆర్‌డీఓ అధికారుల మాటలతో విసిగిన వర్షిణి తలిదండ్రులు డిసెంబర్‌ 23న కదల్లేని స్థితిలో ఉన్న తమ కుమార్తెను ప్రజావాణికి తీసుకుని వచ్చి నేరుగా కలెక్టర్‌ పాటిల్‌ను కలిశారు. ఆమె దీనస్థితికి చలించిపోయిన ఆయన.. ఇంత కాలం ఏం చేస్తున్నారంటూ డీఆర్‌డీఓ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి కూడా పెన్షన్‌ అందకపోతే ఎలా అని ప్రశ్నించారు.

కలెక్టర్‌ ప్రత్యేక నిధినుంచి బకాయిలు
బాలిక వర్షిణి దీన స్థితితో తక్షణం స్పందించిన కలెక్టర్‌ పాటిల్‌.. తన ప్రత్యేక నిధి నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌ ఉన్న ఏడాది బకాయిలు ఇవ్వాలని ఆదేశించారు. బాధితుల బ్యాంక్‌ అకౌంట్, ఇతర వివరాలు తీసుకుని ఫైల్‌ తనకు పంపించాలని సూచించారు. పెండింగ్‌ బకాయిలు రెండు, మూడు రోజుల్లో జమ అవుతాయ ని.. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌గా పెన్షన్‌ అందుతుందని బాధితులకు భరోసా ఇచ్చారు. ఇది జరిగి నెల దాటిపోయినా ఇప్పటివరకు ఒక్క పైసా అందలేదు. దీంతో బాధితులు మళ్లీ సోమవారం(నేడు) గ్రీవెన్స్‌లో వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top