గ్రామానికి ఒక నర్సరీ..

A nursery for the village .. - Sakshi

40 వేల మొక్కలను పెంచాలి

వచ్చే ఏడాది కోసం ముందస్తు ప్రణాళిక

హరితహారం సమీక్షలో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

జనగామ : జిల్లాలో అడవుల శాతాన్ని పెంచేందుకు ప్రతి గ్రామంలో ఒక నర్సరీ చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో కలిసి ప్లాంటేషన్ల పెంపకం, నిర్వహణపై సోమవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే ఏడాది హరితహారం కోసం ముందస్తుగా మొక్కలను పెంచేందుకు అన్ని గ్రామాల్లో ఏర్పాట్లు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలతో నర్సరీలను పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సీఎం కేసీర్‌ ఆదేశాల మేరకు ఈ సమీక్ష.. శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, లక్ష్యాలను చేరుకోని అధికారులు, సిబ్బందిపై పంచాయతీరాజ్‌ యాక్టు–2018 ప్రకారం శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా ఆయా గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లు, కార్యదర్శులు ప్రణాళికలను తయారు చేసుకోవాలని తెలిపారు. నర్సరీలతోపాటు ప్రతి కుటుంబం ఆరు మొక్కలను నాటడంతోపాటు వాటిని సంరక్షించుకునే విధంగా అవగాహన కలిగించాలని తెలిపారు.

అనంతరం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి మాట్లాడుతూ హరితహారం పర్యావరణ సమతుల్యత, వాతావరణ పరిస్థితులను కాపాడాలన్నారు. 33 శాతానికి పైగా అడవులు ఉంటేనే  పుష్కలంగా వర్షాలు కురస్తాయన్నారు.

డీఆర్డీఓ మేకల జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 5,6 తేదీల్లో మండలస్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేసుకుని, వచ్చే ఏడాది కోసం ముందస్తు ప్రణాళికలను తయారు చేసుకోవాలన్నారు. సమీక్షలో వ్యవసాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బండ పద్మాయాదగిరిరెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ ఈశ్వరయ్య, హేమలత, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top