ఎడారిని తలపిస్తున్న గోదావరి

no water in godavari river at jannaram - Sakshi

పుణ్యస్నానాలకు తిప్పలే

  జన్నారం మండలంలో కలమడుగు వద్దే దార  

జన్నారం : గోదావరిలో పుణ్యస్నానానికి నీటి కటకట ఏర్పడింది. జన్నారం మండల పరిధి నదీ తీరంలో మహాశివరాత్రి పర్వదినాన పుణ్యస్నానం ప్రయాసగా మారింది. పరమేశ..గంగను విడువుము అని వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పక్కనున్న కడెం ప్రాజెక్టు నుంచి సైతం నీటి బొట్టు విడుదల లేదు. దీంతో మడుగుల్లోనే పుణ్యస్నానం చేయాల్సి వస్తుంది. 

జన్నారం మండలంలో కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, చింతగూడ, రాంపూర్‌ గ్రామాలలో గోదావరి రేవులున్నాయి. ఇందులో కేవలం కలమడుగు గోదావరి రేవులో మాత్రమే ప్రస్తుతం నీళ్లున్నాయి. అవికూడా హస్తల మడుగులో ఎక్కువగా ఉన్నాయి. అయితే మడుగు ప్రాంతం అతి ప్రమాదకరం కాబట్టి భక్తులను పుణ్యస్నానాలకు అనుమతించడం లేదు. మిగతా గోదావరి తీర ప్రాంతాలలో నీరు లేదు. గత సంవత్సరం ఆయా రేవులలో నీరు పుష్కలంగా ఉంది. దీంతో శివరాత్రికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. కానీ ఈఏడాది స్నానాలకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. 

కడెం ప్రాజెక్టు ఉన్నా..

గతంలో కూడా గోదావరి నదిలో నీరు లేని సమయంలో భక్తుల సౌకర్యం కోసం కడెం ప్రాజెక్టు నుంచి నీటిని వదిలారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. ఈసారి కడెంలోనూ సరిపడా నీరు లేకుండపోయింది. దీంతో నీటి విడుదల కుదరదని ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేశారు. కడెం పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 681 అడుగుల్లో నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గోదావరిలోకి చుక్కా నీరు రావడం లేదు. 

జాగ్రత్త వహిస్తే మేలు..

మండలంలో కేవలం కలమడుగు గోదావరి నది రేవులో మాత్రమే నీరు ఉంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకే వచ్చే అవకాశముంది. ఇక్కడ కూడా హస్తల మడుగు(అత్తమడుగు) ప్రాంతంలో నీళ్లు ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ఈ మడుగులో సుమారు 20 మంది వరకు స్నానాల కోసమని వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈసారి శివరాత్రికి కూడా ఇదే ప్రాంతంలో ఎక్కువ మంది స్నానాలకు వచ్చే అవకాశం ఉంది.  అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి న అవసరం ఎంతైనా ఉంది. 

రాత్రి కడెం నీరు విడుదల..

శివరాత్రిని పురస్కరించుకుని స్నానాల కోసం గోదావరి నదీలోకి కడెం ప్రాజెక్టు నుంచి మూడువేల క్యూసెక్కుల నీటిని ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రాత్రి విడుదల చేశారు. నేటి ఉదయం 12 గంటలకు గేట్‌లు బంద్‌ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే కడెం నీరు విడుదల చేసినా జన్నారం మండలం వరకూ వచ్చే అవకాశాలు లేకపోవడం గమనార్హం. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top