నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది...
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ని సరుకుల ధరలూ రెట్టింపయ్యాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఆహార పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ఫలితంగా ఉత్పత్తుల తక్కువగా వచ్చే పరిస్థితి ఉండటంతో వ్యాపారులు, రైస్ మిల్లర్లు నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేస్తున్నారు. దీంతో ధరల పెరుగుతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.
అయినా పౌర సరఫరాల శాఖ, నిఘా విభాగం అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. అక్రమ నిల్వలు, సర్కారు సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతున్న విషయంలో పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధరలు పెరిగినప్పుడు తనిఖీలు ఎక్కువగా జరగాలి. జిల్లాలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతోంది.
గత ఏడాది తనిఖీలో పోలిస్తే ఈ ఏడాది బాగా తగ్గాయి. ఇదే సమయంలో నిత్యావసరాల ధరలు మాత్రం పెరగడం గమనార్హం. ధరలు పెరిగినప్పుడు తనిఖీలు పెరగకపోవడానికి జిల్లా ఉన్నతాధికారుల ఉదాసీనతే కారణంగా కనిపిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ(రేషన్)లో పారదర్శకత పెంచడం, నిత్యావసర వస్తువల ధరల నియంత్రణపై చర్యలు లక్ష్యంగా జిల్లాలో ఉన్న ఆహార సలహా కమిటీ(ఎఫ్‌ఏసీ) సమావేశం నిర్వహణపైనా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మూడు నెలలకు ఒకసారి ఎఫ్‌ఏసీ సమావేశం జరగాల్సి ఉంది. చివరగా 2014 జనవరిలో జరిగింది.
తనిఖీలు నామమాత్రమే..
పౌర సరఫరాల శాఖకు సంబంధించి జిల్లాలో ఐదుగురు సహాయ సరఫరా అధికారులు(ఏఎస్‌వో), ఐదుగురు ఆహార ఇన్‌స్పెక్టర్లు, ఉప తహశీల్దార్లు ఉన్నారు. జిల్లా స్థాయిలో ఒక ధాన్యం కొనుగోలు అధికారి(జీపీవో), సహాయ అధికారి ఉన్నారు. నిత్యావసరాల అక్రమ నిల్వలను నిరోధించడం, ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలను నివారించడం లక్ష్యంగా వీరు నిత్యం తనిఖీలు నిర్వహించాలి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు దాడులు చేయాలి.
ఇలా ప్రత్యేకంగా తనిఖీలు, దాడులు చేసే పౌర సరఫరాల అధికారులు సిబ్బంది కాకుండా ప్రతి మండంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉంటారు. ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లు ఉంటారు. వీరు కూడా ఈ పనులు చేయవచ్చు. నిత్యావసర సరుకుల బడా వ్యాపారులతో, రైస్ మిల్లర్లతో అధికారులకు, కింది స్థాయి ఉద్యోగుల వరకు ఉన్న సత్సంబంధాల కారణంగా ఎవరూ తనిఖీలు చేయడంలేదని తెలుస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేసినా... సంబంధిత వ్యాపారులకు అధికారుల నుంచి ముందుగానే సమాచారం అందుతుందనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు సరఫరా చేసే సరుకులను కొనుగోలు చేయాలంటే కొన్ని ఇతర వస్తువులు తీసుకోవాల్సిందేనని కొందరు రేషన్ డీలర్లు ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినా పౌర సరఫరాల అధికారులు స్పందించడంలేదు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ సైతం దాడులు, తనిఖీల విధులను దాదాపుగా పక్కనబెట్టింది. ఏదైనా ఫిర్యాదు వస్తే కింది స్థాయి సిబ్బంది అక్కడి వెళ్లి, తర్వాత పౌర సరఫరాల అధికారులకు సమాచారం ఇచ్చి రావడం జరుగుతుందే తప్ప చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు.