భద్రత లేని బతుకులు

No Salaries To Part Time Sweepers  - Sakshi

పర్మినెంట్‌ కోసం పార్ట్‌టైం స్వీపర్ల ఎదురుచూపులు

వేతనాల కోసం తప్పని తిప్పలు

ఆరు నెలలుగా జీతాలు ఇవ్వని వైనం

నంగునూరు(సిద్దిపేట) : ‘మూడు దశాబ్దాలుగా పాఠశాలల్లో స్వీపర్లుగా పని చేస్తున్నా మాకు ఉద్యోగ భద్రత లేదు.. భరోసా ఇచ్చేవారు కరువయ్యార’ని పార్ట్‌టైం స్వీపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు పర్మినెంట్‌ అవుతాయని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం కనికరించడం లేదని వాపోతున్నారు. పార్ట్‌ టైం స్వీపర్లుగా  పని చేస్తూ జిల్లావ్యాప్తంగా ఎంతో మంది మరణించగా వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రోజూ పని చేస్తేనే పూట గడిచే తమకు ప్రభుత్వం సరైన వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరు నెలలుగా వేతనాలు రావడం లేదని, జీతాలు రాకుంటే ఇల్లు ఎలా గడుస్తుందని వారు ప్రశిస్తున్నారు.  

పాఠశాలలు తెరచినప్పటి నుంచి మూసే వరకు తరగతి గదులు శుభ్రపరిచి, టాయిలెట్లు శుభ్రం చేస్తూ పిల్లలకు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా చూస్తూ పొద్దంతా పని చేస్తున్నారు స్వీపర్లు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తే వారికి ఇచ్చేది నెలకు రూ. 4 వేలు మాత్రమే. ఇది కూడా ప్రతీ నెల వేతనాలు చెల్లించకపోవడంతో  కుటుంబ పోషణ భారంగా మారింది. పెరుగుతున్న ఖర్చులను తట్టుకునేందుకు భార్యా పిల్లలతో పాటు తాము సెలవు దినాల్లో కూలీ పనులకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఇందులో చాల మంది స్వీపర్లు వికలాంగులు, వృద్ధులు కావడంతో ఏ పనీ చేతకాక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వందలాది  పాఠశాలల్లో పార్ట్‌ టైం స్వీపర్లుగా పని చేస్తుండగా నంగునూరు మండలంలో ఏడుగురు పార్ట్‌టైం, ఒకరు ఫుల్‌టైం స్వీపర్‌గా, సిద్దిపేట మండలంలో 11 మంది పార్ట్‌ టైం స్వీపర్లుగా, చిన్నకోడూరు మండలంలో 9మంది పని చేస్తున్నారు. 

మూడు జీఓలు జారీ చేసినా ఫలితం శూన్యం

పార్ట్‌ టైం, ఫుల్‌ టైం స్వీపర్లను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం 1994లో ఏప్రిల్‌ 22న (ఆర్థిక ప్రణాళిక శాఖ ఎఫ్‌.డబ్ల్యూ.పి.సి–3) 112 జీఓ జారీ చేసింది. అలాగే 1997లో జూలై 23 న సైతం 112 జీఓ ద్వారా ఉద్యోగాలు పర్మినెంట్‌ చేస్తున్నామని ప్రకటించినా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అమలు కాలేదు. తర్వాత సీపీఆర్, ఆర్‌ఈ 2011లో, 2013న మరో సారి పార్ట్‌ టైం స్వీపర్లను పర్మినెంట్‌ చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.

జీఓ ప్రకారం ఐదేళ్లు పని చేసిన ఫుల్‌ టైం స్వీపర్లను, పది సంవత్సరాలు పని చేసిన పార్ట్‌టైం స్వీపర్ల ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాల్సి ఉంది. జీఓ ఎంఎస్‌ నంబర్‌ 250 ప్రకారం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 49 మందిని స్వీపర్‌ కమ్‌ నైట్‌వాచ్‌మెన్‌లుగా పదోన్నతులు కల్పించారు. అయినా ఏడు సంవత్సరాలుగా పార్ట్‌ టైం, 21 సంవత్సరాలుగా ఫుల్‌టైం స్వీపర్‌గా పని చేస్తున్న తనకు ఇప్పటికి ప్రమోషన్‌ రాలేదని స్వీపర్‌ ముండ్రాతి మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.

సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్నా 

33 సంవత్సరాల కిందట రూ. 150తో పారŠట్ట్‌టైం స్వీపర్‌గా పనిలో చేరిన. విద్యార్హత ఉన్నందున 1992 లో ఫుల్‌టైం స్వీపర్‌గా ప్రమోషన్‌ వచ్చింది. రూల్స్‌ ప్రకారం ఐదేళ్లకు పర్మినెంట్‌ చేయాలి. 25 ఏళ్లుగా ఫుల్‌టైం స్వీపర్‌గా డ్యూటీ చేస్తున్నా పర్మినెంట్‌ కాలేదు. ఈ విషయంపై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. నాకు ఉద్యోగం పర్మినెంట్‌ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చినా నేటి వరకు అమలుకు నోచుకోలేదు.

– ముండ్రాతి మల్లయ్య, పాలమాకుల

ఆరు నెలలుగా జీతాలు లేవు

ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇచ్చిందని సంతోషపడ్డా. 25 ఏళ్లుగా ఖాత గ్రామంలో పార్ట్‌ టైం స్వీపర్‌గా పని చేస్తున్నా ఉద్యోగం పర్మినెంట్‌ కావడం లేదు. అంగవైకల్యంతో ఇతర పనులు చేయలేక కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ప్రతీ నెల జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆరు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నాం.

 – కట్కూరి యాదగిరి, ఖాతా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top