పరిపాలనా సంస్కరణ.. జేసీలు ఉండరు

No JC Posts In Telangana Govt Will Take Decision Soon - Sakshi

కొత్తగా అదనపు కలెక్టర్, అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) పోస్టుల సృష్టి

జిల్లా స్థాయిలో పరిపాలనా సంస్కరణ 

33 జిల్లాలకు జేసీ స్థానంలో అదనపు కలెక్టర్ల నియామకం  

ఇకపై రెవెన్యూ శాఖ బాధ్యతలు వారికే! 

11న జరగనున్న కలెక్టర్ల సదస్సులో జాబ్‌ చార్ట్‌పై స్పష్టత నివ్వనున్న ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పాలనా సంస్కరణల అమల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జిల్లా స్థాయిలో రెవెన్యూ చట్టం అమలు, భూ వ్యవహారాలను పర్యవేక్షించే జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) పోస్టును రద్దు చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు జాయింట్‌ కలెక్టర్ల స్థానంలో అదనపు కలెక్టర్లను నియమించింది. చాలా జిల్లాల జాయింట్‌ కలెక్టర్లను అదే జిల్లాకు అదనపు కలెక్టర్లుగా బదిలీ చేసింది. కొన్ని జిల్లాలకు కొత్త అధికారులను అదనపు కలెక్టర్లుగా, అలాగే 14 జిల్లాలకు వేరే అధికారులను అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు)గా నియమించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 49 మంది నాన్‌కేడర్, కేడర్‌ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర పాలన సర్వీసుల దిశగా.. 
ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌) తరహాలో తెలంగాణ స్టేట్‌ అడ్మిని స్ట్రేటివ్‌ సర్వీసును నెలకొల్పి రాష్ట్రంలో పాలనా సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు అవినీతికి ఆస్కారం లేని విధంగా, ప్రజలకు మరింతగా సేవలు అందించేందుకు వీలుగా కొత్త రెవెన్యూ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. ఈ క్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పోస్టును రద్దు చేసి అదనపు కలెక్టర్, అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) పోస్టులను సృష్టించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కలెక్టర్‌ నేతృత్వంలోని అదనపు కలెక్టర్ల బృందంతో జిల్లా స్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అదనపు కలెక్టర్, అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)లకు కొన్ని నిర్దిష్ట శాఖలు అప్పగించనుంది. అదనపు కలెక్టర్లు ప్రధానంగా రెవెన్యూ శాఖను పర్యవేక్షించనున్నారు. అదనపు కలెక్టర్ల(స్థానిక సంస్థలు)కు ప్రభుత్వం కీలకమైన కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్‌ చట్టాల అమలు బాధ్యతలను అప్పగించనుంది.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, అకస్మిక తనిఖీలు, నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకునే అధికారాలను వీరికి కట్టబెట్టనుంది. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లను సైతం వీరి పరిధిలోకి తీసుకురానుంది. లే అవుట్ల అనుమతులు, ఆస్తుల గణన (ప్రాపర్టీ అసెస్‌మెంట్స్‌) తదితర పనులను వీరికే అప్పగించే అవకాశముంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, పారిశుధ్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, నర్సరీ ఏర్పాటు, సర్టిఫికెట్ల జారీ ఇకపై వీరే పర్యవేక్షించనున్నారు. వీరిపై జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది. కలెక్టర్, అడిషనల్‌ కలెక్టర్, అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) పోస్టుల విధులు, బాధ్యతలు, జాబ్‌ చార్ట్‌పై ఈ నెల 11న నిర్వహించనున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్‌ స్పష్టత ఇస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవలు అందించడం, అవినీతికి, అలసత్వానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించనుంది.

అవినీతి నిర్మూలనే ప్రధాన ధ్యేయం.. 
కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో భారీ పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భారీగా పరిపాలన వికేంద్రీకరణ జరిగినా అవినీతి కారణంగా ప్రజలకు ఆశించిన ఫలితాలు అందట్లేదు. అవినీతి నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్‌ చట్టాలను తీసుకురాగా, త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. రెవెన్యూ కార్యాలయాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా కావల్సిన పనులు జరగాలని, ఇందుకు కఠినంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్‌ పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా స్థాయిలో కొత్తగా అదనపు కలెక్టర్‌ పోస్టులను సృష్టించి, ఒక్కో అదనపు కలెక్టర్‌కు కొన్ని కీలకమైన శాఖల బాధ్యతలను అప్పగించబోతోంది.

త్వరలో రాష్ట్ర స్థాయిలో కూడా.. 
రాష్ట్ర స్థాయిలో సైతం ప్రభుత్వం పాలన సంస్కరణలను అమలు చేయబోతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముఖ్యమైన అధికారుల వ్యవస్థ ఏర్పాటు చేయనుంది. సీఎస్‌కు సహాయంగా అదనపు సీఎస్‌ల బృందాన్ని నియమించనుంది. వీరికి కొన్ని శాఖల బాధ్యతలను అప్పగించనుంది. జిల్లా స్థాయిలో ఐఎఎస్‌ అధికారి నేతృత్వంలో పనిచేసే బృందం పనితీరును సీఎస్‌ నాయకత్వంలోని బృందం పర్యవేక్షించనుంది. ఎప్పటికప్పుడు కావాల్సిన నిర్ణయాలను ఈ బృందం తీసుకోనుంది. (చదవండి: అక్బరుద్దీన్‌ ఒవైసీ వినతి.. కేసీఆర్‌ ఆదేశం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top