మహంకాళి ఆలయాన్ని అభివృద్ధి చేయండి

AKbaruddin Owaisi Meeting With CM KCR - Sakshi

అఫ్జల్‌గంజ్‌ మసీదు మరమ్మతులకు రూ.3 కోట్లు ఇవ్వండి

సీఎంకు ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ వినతి

వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు కేసీఆర్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీలోని లాల్‌దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు. ప్రగతిభవన్‌లో ఆదివారం ముఖ్యమంత్రిని కలసి ఈ మేరకు ఆయన వినతిపత్రం అందజేశారు. ప్రతి ఏటా ఈ ఆలయంలో నిర్వహించే బోనాలు దేశవ్యాప్తంగా లాల్‌దర్వాజ బోనాలుగా ప్రసిద్ధి చెందాయని ఆయన గుర్తు చేశారు. ఇంతటి ప్రసిద్ధి ఉన్నా చాలినంత స్థలం లేకపోవడం వల్ల ఆలయ ప్రాంగణం అభివృద్ధికి నోచుకోవట్లేదని.. దీనివల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని సీఎం దృష్టికి తెచ్చారు.

‘లాల్‌ దర్వాజ మహంకాళి ఆలయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. బోనాల పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ గుడిలో పూజలు చేసి, బోనాలు సమర్పిస్తారు. కానీ ఈ గుడి ప్రాంగణం కేవలం వంద గజాల స్థలంలోనే ఉంది. ఇంత తక్కువ స్థలం ఉండటం వల్ల లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎంతో అసౌకర్యం కలుగుతోంది. రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయండి. దేవాలయ విస్తరణ వల్ల దీనికి ఆనుకుని ఉన్న వారు ఆస్తులు కోల్పోయే అవకాశముంది. వారికి ప్రత్యామ్నాయంగా జీహెచ్‌ఎంసీ అధీనంలో ఉన్న ఫరీద్‌ మార్కెట్‌ ఆవరణలో 800 గజాల స్థలం ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలని కోరుతూ స్వయంగా (ముఖ్యమంత్రి) మీరు బంగారు బోనం సమర్పించారు. ఆలయ విస్తరణకు ఆ సమయంలోనే ప్రకటన కూడా చేశారు. ఇక పాతబస్తీలోని అఫ్జల్‌గంజ్‌ మసీద్‌ మరమ్మతుల కోసం రూ.3 కోట్లు మంజూరు చేయండి. ఎంతో మంది ముస్లింలు నిత్యం ఈ మసీదులో ప్రార్థనలు చేస్తారు. మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతోంది..’అని అక్బరుద్దీన్‌ సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. మహంకాళి దేవాలయ అభివృద్ధికి, అఫ్జల్‌గంజ్‌ మసీదు మరమ్మతులకు వెంటనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రార్థనా మందిరాల అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top