మళ్లీ నో క్యాష్‌..!

no cash boards in atm - Sakshi

పండుగ పూట పైసల్లేవ్‌..

ఏటీఎంల వద్ద చాంతాడంత క్యూలు

సాక్షి నెట్‌వర్క్‌: సంక్రాంతి పండుగకు కొత్త బట్టలు కొనాలన్నా, ఇతర సరుకులు కొనాలన్నా చేతిలో నగదు లేని పరిస్థితి నెలకొంది. ఈ నెల మొదట్లో కొంతవరకు ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉన్నా.. నాలుగైదు రోజులుగా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఏ ఏటీఎం వద్దకు వెళ్లినా ‘నో క్యాష్‌’బోర్డులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల డబ్బు లేదనేందుకు బదులుగా ఏకంగా ‘ఏటీఎం ఔటాఫ్‌ సర్వీస్‌’అంటూ బోర్డులు పెట్టేస్తున్నారు. కొన్ని చోట్ల ఏటీఎం షెట్టర్లను కూడా మూసేస్తున్నారు.

బ్యాంకులకు వెళితే బోలెడు క్యూలు
ఏటీఎంలలో నగదు లభించకపోవడంతో బ్యాంకు లకు వెళుతున్న వారికీ ఇబ్బందులు తప్పడం లేదు. బ్యాంకుల్లో చాంతాడంత క్యూలు ఉంటున్నాయి. గంటలు గంటలు నిలబడితేగానీ డబ్బులు తీసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మహిళా సంఘాల వారు, పింఛన్ల కోసం వచ్చే వారితోపాటు సాధారణ ఖాతాదారులతో బ్యాంకులు కిటకిటలాడుతుంటాయి. ఇప్పుడు నగదు కోసం వెళ్లేవారితో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల బ్యాంకుల్లో తగినంత నగదు లేదంటూ రూ. పది వేలు వరకు మాత్రమే చేతిలో పెడుతున్నారు.

కార్డులు వాడుదామంటే బాదుడు!
నగదు చేతిలో లేక ఏటీఎం/డెబిట్‌ కార్డులను వినియోగించుకుందామంటే బాదుడు తప్పడం లేదు. అసలు చిన్న పట్టణాలు, గ్రామాల్లో అసలు కార్డు స్వైపింగ్‌ యంత్రాలే అందుబాటులో లేవు. చాలా చోట్ల క్రెడిట్‌/డెబిట్‌ కార్డులతో డబ్బులు చెల్లిస్తామంటే.. 2 శాతం వరకు అదనంగా వసూలు చేస్తు న్నారు. దీంతో అటు నగదూ లేక ఇటు కార్డులూ వాడితే బాదుడు భరించలేక జనం లబోదిబోమంటున్నారు.  

ఆర్‌బీఐ సరఫరా నిలిపేయడంతోనే..!
సరిపడా నగదు అందుబాటులో లేకనే బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు ఉండడం లేదని బ్యాంకుల అధికారులు చెబుతున్నారు. రిజర్వు బ్యాంకు నగదు సరఫరాను నిలిపివేయడంతోనే ఈ సమస్య ఏర్పడిం దంటున్నారు. బ్యాంకుల్లోకి కొత్తగా డిపాజిట్లు రావడం తగ్గిపోయిందని, అదే సమయంలో నగదు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయిందని అంటున్నారు.

‘‘బ్యాంకుల నిబంధనలు మారుతాయి, నష్టాలు వస్తే డబ్బులు పోతాయి.. అనే ప్రచారం ఉండటంతో ఇంతకు ముందటిలా బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్‌ చేసేందుకు ఖాతాదారులు ముందుకు రావడం లేదు. దీంతో నగదు కొరత ఏర్పడుతోంది.’’ అని ఓ బ్యాంకు అధికారి పేర్కొనడం గమనార్హం.

బ్యాంకులకు వెళ్లినా లాభమేదీ?
వరంగల్‌ పాత జిల్లా పరిధిలో దాదాపు 215 ఏటీఎంలు ఉండగా అందులో 90శాతం ఏటీఎంలు నగదు లేక వెలవెలబోతున్నాయి. జనం నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 254 ఏటీఎంలు, కామారెడ్డి జిల్లాలో 120 ఏటీఎంలు ఉండగా.. చాలా వాటిలో ‘నో క్యాష్‌’బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో నగదు కొరత తీవ్రంగా ఉంది. నాలుగైదు రోజులుగా చాలా ఏటీఎంలు పూర్తిగా మూతపడ్డాయి.  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో పది రోజులుగా నగదు కొరత ఏర్పడింది. వేములవాడలో ఏటీఎంలు పనిచేయకపోవడంతో రాజన్న దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

సాయంత్రం దాటితే ‘క్యాష్‌’లేనట్లే!
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, యాదాద్రి భువనగరి, సూర్యాపేట జిల్లాల్లో చాలా వరకు ఏటీఎంలు ఖాళీగా కనిపిస్తున్నాయి. కొన్నిం టిలో నగదు నింపుతున్నా కొద్దిగంటల్లోనే ఖాళీ అవుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రమైతే ఏ ఏటీఎం లోనూ డబ్బులుండటం లేదు.  ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌ నగర్, ఖమ్మం జిల్లాల్లో ఏటీఎంలున్నా.. వాటిలో చాలావరకు నెలలో మొదటి వారంలోనే పనిచేస్తాయి.  

ఎన్నాళ్లీ అవస్థలు?
నోట్ల కొరతతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏటీఎంలలో డబ్బుల్లేవు. బ్యాంకుల్లో పెద్ద పెద్ద లైన్లు. ఎన్నాళ్లీ అవస్థలు భరించాలి..      – రాజు యాదవ్, కూకట్‌పల్లి డివిజన్, హైదరాబాద్‌

బ్యాంకుల్లో లైన్లు.. ఆన్‌లైన్‌లో మోసాలు
నోట్ల రద్దు నాటి నుంచి డబ్బుల కోసం తిప్పలు తప్పడం లేదు. ఏటీఎంలలో డబ్బుల్లేవు. బ్యాంకులకు వెళితే గంటలు గంటలు ఉండాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌ వాడుదామంటే రోజుకో కొత్త మోసం పేరిట వార్తలు వస్తూ భయపెడుతున్నాయి.. – సత్యనారాయణ, వివేకానందనగర్‌ కాలనీ, హైదరాబాద్‌  

హైదరాబాద్‌లో కటకట
హైదరాబాద్‌లో వేలాది ఏటీఎంలున్నా నగదు కోసం కటకట తప్పడం లేదు. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి.. ఇలా ఏ ప్రాంతమైనా ఇదే సీన్‌. ఏటీఎంలు నగదు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ‘ఔటాఫ్‌ సర్వీస్‌’, ‘నో క్యాష్‌’బోర్డులు వెక్కిరిస్తున్నాయి. కేవలం బ్యాంకులకు అనుసంధానంగా ఉన్న చోట్ల మాత్రమే ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంది. దాంతో వాటి ముందు జనం బారులు తీరుతున్నారు.

మొత్తంగా మూడు వేల ఏటీఎంలు ఉండగా.. సగానికిపైగా ఖాళీయే. మిగతా వాటిలోనూ రోజూ రూ. లక్ష, రెండు లక్షలు మాత్రమే నింపుతున్నారు. ఈ నగదు రెండు మూడు గంటల్లోనే అయిపోతోంది. చాలా మంది నగదు కోసం ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. నగదు చేతిలో లేకపోవడంతో బస్సు, ఆటో చార్జీలు, చిల్లర సరుకుల కొనుగోళ్లకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి తదితర ప్రధాన బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్ల వద్ద ప్రయాణికులు నగదు కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిలో ఉన్న ఏటీఎంలు పూర్తిగా ఖాళీగా ఉంటున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top