కాళేశ్వరంపై ఎన్జీటీకి పరిధి లేదు

NGT does not have a range on Kaleshvaram - Sakshi

హైకోర్టులో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసిన ప్రభుత్వం

ట్రిబ్యునల్‌ ఉత్తర్వుల్లో అనుమానాల్ని నివృత్తి చేయండి: హైకోర్టు

విచారణ నేటికి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో విచారణ కొనసాగింది. ఎన్జీటీ ఉత్తర్వులపై ఉన్న కొన్ని సందేహాల్ని నివృత్తి చేస్తే ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టాలో లేదో నిర్ణయిస్తామని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎన్జీటీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయాలా లేక హైకోర్టులో చేయవచ్చా అనేది తేలాల్సివుందని, అందుకే పిటిషన్‌ విచారణ అర్హతపైనే తాము తొలుత విచారణ చేస్తామని ధర్మాసనం ప్రకటించింది. ఈ విషయం తేలే వరకు పిటిషన్‌లోని ప్రధాన అంశాలపై ఈదశలో విచారణ చేయబోమని తెలిపింది.

కాలపరిమితి ముగిసింది.. 
ఎన్జీటీ ఉత్తర్వుల పూర్తి కాపీ మంగళవారం అందులోబాటులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టులో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై పిటిషన్‌ దాఖలు చేసేందుకు కాలపరిమితి ముగిసింది. అయినా పిటిషనర్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. దానిని విచారించే అర్హత ట్రిబ్యునల్‌కు లేదు. ట్రిబ్యునల్‌ కూడా విచారణ చేయడమే కాకుండా ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఇది చట్ట వ్యతిరేకం. ఇది ట్రిబ్యునల్‌ విచారణ పరిధి కాదని రిట్‌లో పేర్కొనలేదు. అందుకే అదనపు అఫిడవిట్‌ దాఖలు చేశాం’అని రాష్ట్రం హైకోర్టుకు తెలిపింది. ‘పర్యావరణ అనుమతులు లేవని చెప్పి మొత్తం ప్రాజెక్టు పనులనే నిలిపివేస్తూ ట్రిబ్యునల్‌ అన్యాయంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అటవీ ప్రాంతంలో పనులనే కాకుండా ఇతర ప్రాంతంలోని పనుల్నీ ఆపేయమని ఉత్తర్వులు ఇవ్వడం చట్ట వ్యతిరేకం. పర్యావరణ అనుమతుల కోసం చేసిన దరఖాస్తు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం భూముల సాగు కోసం ప్రాజెక్టు పనులు చేయడం లేదు. కేవలం తాగు నీటి అవసరాల కోసమే పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఎన్జీటీ తప్పుగా అర్థం చేసుకుంది’అని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. కాగా, ఎన్జీటీ ఉత్తర్వుల ప్రతి తమకు ఇప్పుడే అందినందున విచారణను వాయిదా వేయాలని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకట రమణ కోరారు. దాంతో విచారణ గురువారానికి వాయిదా పడింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top