కొత్తగా 341 బస్తీ దవాఖానాలు

Newly 341 Basthi Hospitals - Sakshi

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం... 

ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 247 దవాఖానాలు 

పలుచోట్ల డయాగ్నస్టిక్‌ సెంటర్లు నెలకొల్పేందుకు చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 341 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 247, గ్రామీణ ప్రాంతాల్లో 75, నిర్దేశిత జిల్లాల్లో 11, గిరిజన ప్రాంతాల్లో 8 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తారు. కొత్తగా ఏర్పాటు చేసే దవాఖానాలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ ఏరియాలో ఇప్పటికే 54 చోట్ల పనులు మొదలయ్యాయి. మరో 97 దవాఖానాల ఏర్పాటుకు ఏరియాలను గుర్తించారు. ఇప్పటికే నడుస్తున్న బస్తీ దవాఖానాల్లో 35 చోట్ల డయాగ్నస్టిక్‌ సెంటర్లను ప్రారంభిస్తారు. ఆయా సెంటర్లలో రక్త, మూత్ర పరీక్షలు కూడా చేయనున్నారు. ఈసీజీ వంటి సేవలూ అందుబాటులోకి రానున్నాయి. బస్తీ దవాఖానాలపై వైద్య ఆరోగ్యశాఖ తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది.  

ప్రయోగాత్మకంగా స్పెషలిస్టు వైద్యం... 
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం, వైద్య పరీక్షలు నిర్వహించాలన్న ఉద్దేశంతో గతేడాది ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పేదలు అధికంగా ఉండే 50 మురికివాడల్లో మొదట్లో బస్తీ దవాఖానాలు నెలకొల్పారు. సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా, సూపర్‌ స్పెషాలిటీ లాంటి పద్ధతికి బదులు నగర ప్రజలు, అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మూడంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలనేది దీని ఉద్దేశం. సబ్‌ సెంటర్ల తరహాలో బస్తీ దవాఖానాలు, సీహెచ్‌సీలు, ఏరియా దవాఖానాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. సీహెచ్‌సీలు రిఫరల్‌ దవాఖానాలుగా పనిచేసేలా ఉంటున్నాయి. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ తదితర సూపర్‌ స్పెషాలిటీ దవాఖానాలు ఎలాగూ ఉన్నందున వాటి సేవలను మరింత మెరుగుపర్చాలని నిశ్చయించారు.

నగరంలో సుమారు 1,400 మురికివాడలు ఉండగా 1,000 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్నది సర్కారు లక్ష్యం. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో, ఇతర కార్పొరేషన్లలో కలిపి 249 బస్తీ దవాఖానాలు పనిచేస్తున్నాయి. కొత్తగా వాటికి మరో 341 కలుపుతారు. మొత్తంగా 590 బస్తీ దవాఖానాలు కానున్నాయి. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత విస్తరించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే బస్తీ దవాఖానాల్లో మూడునాలుగు వాటిల్లో స్పెషలిస్టు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాంటిచోట్ల రోగుల నుంచి ఎంతో కొంత రుసుం వసూలు చేయాలని, వాటిని ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top