స్టార్టప్స్‌ కోసం ‘నయా వెంచర్స్‌ యాక్సిలరేటర్‌’

'New Ventures Accelerator' for Startups - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్టార్టప్‌ సంస్థలకు ప్రారంభ దశ నుంచి తోడ్పాటు అందించే క్రమంలో వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ నయా వెంచర్స్‌ తాజాగా గ్లోబల్‌ యాక్సిలరేటర్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సదస్సు సందర్భంగా సంస్థ ఎండీ దయాకర్‌ పుస్కూర్‌ దీన్ని ఆవిష్కరించారు. బూట్‌ అప్‌ వెంచర్స్, జెడ్‌ నేషన్‌ ల్యాబ్‌తో కలిసి దీన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనుకునే స్టార్టప్‌లకు ఇది అనువైనదిగా దయాకర్‌ చెప్పారు.

ఈ ప్రోగ్రాం ప్రారంభ దశలో.. స్టార్టప్స్‌కి కావాల్సిన నైపుణ్యాలపై జెడ్‌ నేషన్‌ ల్యాబ్స్‌ శిక్షణనిస్తుందని చెప్పారాయన. తర్వాత కొన్నాళ్ల పాటు అమెరికాలోని కాలిఫోర్నియా, డల్లాస్‌లలో నైపుణ్యాలను మెరుగుపర్చుకునే అవకాశం లభించగలదని వివరించారు. ‘‘స్టార్టప్‌లు ఆయా దశలను బట్టి రెండు లక్షల డాలర్ల నుంచి ఇరవై లక్షల డాలర్ల దాకా ఫండింగ్‌ కూడా పొందే అవకాశం ఉంది. పెట్టుబడులతో పాటు కస్టమర్లు, మెంటార్ల తోడ్పాటు కూడా ఈ గ్లోబల్‌ యాక్సిలరేటర్‌ ద్వారా పొందవచ్చు’’ అని దయాకర్‌ చెప్పారు.

మరోవైపు, మొదటి ఫండ్‌ విలువ సుమారు 50 మిలియన్‌ డాలర్లుగా ఉండగా.. త్వరలో రెండో ఫండ్‌ కూడా ప్రారంభించాలని, దాదాపు 75–100 మిలియన్‌ డాలర్ల దాకా సమీకరించాలని భావిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నయావెంచర్స్‌ సుమారు పదిహేడు స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిందని, ఇవి దాదాపు 80 మిలియన్‌ డాలర్ల దాకా సమీకరించాయని దయాకర్‌ వివరించారు.

స్టార్టప్‌లు లింగ వైవిధ్యాన్ని పాటించాలి
సిస్కో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జాన్‌ చాంబర్స్‌
న్యూఢిల్లీ: స్టార్టప్‌లు పని ప్రదేశాల్లో స్త్రీ, పురుష వైవిధ్యాన్ని పాటించాలని, మరింత మంది మహిళలను భిన్న రకాల పనుల్లో నియమించుకోవడం ద్వారా ఉత్పత్తిని పెంచాలని సిస్కో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జాన్‌ చాంబర్స్‌ అభిలషించారు. భారత్‌లో స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ బూమ్‌ మీద ఉండటంతో ఈ దేశం ప్రపంచ స్టార్టప్‌ ఇంజన్‌గా నిలిచేందుకు సామర్థ్యాలున్నా యని పేర్కొన్నారు. అమెరికా–భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం చైర్మన్‌గానూ చాంబర్స్‌ పనిచేస్తున్నారు.

‘‘భారత్‌ అద్భుతమైన పని చేసింది. ప్రభుత్వంలోనూ, వ్యాపారాల్లోనూ గొప్ప మహిళా నేతలున్నారు. కానీ, ఉపాధిలో మరింత కిందకు పడిపోతున్నందున స్టార్టప్‌లలో లింగ వైవిధ్యాన్ని పరిష్కరించాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. అమెరికాలో ఇది 24 శాతంగా ఉందని, అయినా ఇరు దేశాలూ ఈ విషయంలో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

మార్కెటింగ్‌ కీలకం
షహనాజ్‌ హుసేన్‌ గ్రూప్‌ సీఎండీ షహనాజ్‌ హుసేన్‌
హైదరాబాద్‌:
మార్కెటింగ్, పెట్టుబడుల కోసం నిధుల సమీకరణ మార్గాలపై అవగాహన పెంచుకోవడం ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అత్యంత కీలకమని సౌందర్య సాధనాల ఉత్పత్తుల సంస్థ షహనాజ్‌ హుసేన్‌ గ్రూప్‌ సీఎండీ షహనాజ్‌ హుసేన్‌ తెలిపారు. అడ్డంకులను అధిగమించి వ్యాపార రంగంలోకి ప్రవేశించినా.. మహిళా ఎంట్రప్రెన్యూర్స్‌ ఈ విషయాల్లో కొంత వెనకబడుతున్నారని ఆమె పేర్కొన్నారు.

మహిళా ఎంట్రప్రెన్యూర్స్‌ తమ నైపుణ్యాలను, నెట్‌వర్కింగ్‌ మెరుగుపర్చుకునేందుకు జీఈఎస్‌ వంటి వేదికలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా సౌందర్య సాధనాల మార్కెట్‌ దాదాపు రూ.5,000 కోట్లకు పైగా, బ్యూటీ సెలూన్‌ సర్వీసుల పరిశ్రమ రూ.10,000 కోట్ల స్థాయిలో ఉందని ఆమె చెప్పారు. స్వల్పకాలంలో తక్కువ ఖర్చులోనే శిక్షణ కూడా పొందగలిగే సౌలభ్యం ఉన్నందున మహిళలు ఈ రంగంపై దృష్టి సారించవచ్చన్నారు.

వ్యాపారవేత్తలకు జీఈఎస్‌ ఊతం
ఓలా సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ వ్యాఖ్య
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:
ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌ షిప్‌ సదస్సు ఔత్సాహిక వ్యాపారవేత్తల్లో స్ఫూర్తి నింపిందని ట్యాక్సీ సేవల సంస్థ ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎంట్రప్రెన్యూర్‌ షిప్‌ పెరిగేందుకు ఇది మరింతగా తోడ్పడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

స్టార్టప్‌లు, వ్యాపార మెలకువలు, ప్రమాణాలు, అత్యుత్తమ విధానాలు తదితర అంశాలపై చర్చించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఎంట్రప్రెన్యూర్లు, ఇన్వెస్టర్లు, నూతన ఆవిష్కర్తలు, ప్రభుత్వ వర్గాలు ఇందులో పాల్గొనడం హర్షణీయ మని చెప్పారాయన. స్టార్టప్‌ సంస్థలకు క్రమశిక్షణ, ఓర్పు ముఖ్యమన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా స్టార్టప్‌ సంస్థలు నిరాశ చెందకుండా, నిరంతరం శ్రమిస్తేనే నిలదొక్కుకోగలమన్నది గు ర్తుంచుకో వాలని సూచించారు. కొత్త ఐడియా ఊతంతో యువత ప్రారంభించే స్టార్టప్‌ లకు.. అనుభవజ్ఞులైన సీనియర్ల తోడ్పాటు ఉంటే పురోగతి ఉంటుందని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top