వడివడిగా అడుగులు

New Reservoir Soon in  Near Jurala Project Mahabubnagar - Sakshi

ఎగువ భాగాన 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణానికి చర్యలు

రిటైర్డ్‌ ఇంజినీర్ల ప్రతిపాదనకు మొగ్గుచూపిన ఇరిగేషన్‌ శాఖ

ఈఎన్‌సీ పూర్తిచేసుకుని ఉన్నతాధికారులకు చేరిన నివేదిక

ప్రభుత్వం తుది నిర్ణయం కోసం ఎదురుచూపు

గద్వాల రూరల్‌: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ భాగాన మరో జలాశయం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇది వరకే  గట్టు ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా మరో ప్రాజెక్టును తెరమీదకు తెచ్చింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గ్రామాలు, భూములు ఎక్కువగా ముంపునకు గురవకుండా తక్కువ భూ సేకరణతో జలాశయం ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఇటీవల రిటైర్డ్‌ ఇంజినీర్ల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి వివరాలతో నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇదే నివేదికను ప్రభుత్వం ఈఎన్‌సీ అధికారులకు అందజేసి పరిశీలించాలని ఆదేశించింది. దీంతో ఉన్నతాధికారులు గద్వాల జిల్లా ఇంజినీరింగ్‌ అధికారులను విచారణ చేసి నివేదిక అందించాలని సూచించడంతో 16 రోజుల క్రితం పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు అందించారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని జలాశయం నిర్మాణం చేపడితే ఉమ్మడి జిల్లాలో సుమారు 6లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందే అవకాశం ఉంది.

జూరాల వెనకజలాలకు..
జూరాల వెనక జలాలకు సుమారు అర కిలోమీటర్‌ దూరంలో ద్యాగదొడ్డి, నాగర్‌దొడ్డి ప్రాంతాల నడుమ అదనపు జలాశయాన్ని నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. 3,600ఎకరాల్లో 20 టీఎంసీల సామర్థ్యంతో జలాశయ నిర్మాణాన్ని చేపట్టనుండగా కట్ట పొడవు 15 కిలోమీటర్లు ఉంటుంది. జూరాల కుడి కాల్వ పరిధిలోని 37వేల ఎకరాలతో పాటు నెట్టెంపాడు, తుమ్మిళ్ల ఎత్తిపోతలు కలుపుకొని 2.70 లక్షల ఎకరాలకు, జూరాల ఎడమ కాల్వ పరిధిలోని 63 వేల ఎకరాలతోపాటు భీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులతో కలుపుకొని మూడు లక్షల ఎకరాలకు సాగునీటి ని అందించవచ్చని ఇరిగేషన్‌ అధికారులు లెక్క తేల్చారు. జలాశ యంలోకి నీటిని పంపింగ్‌ చేసేందుకు 40 మెగావాట్ల సామర్థ్యంతో 5 పంపులు అవసరమవుతాయి. ఇదే అంశాలను పేర్కొంటూ తుది నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు.

అనుమతి వస్తే కార్యాచరణ
రిటైర్డ్‌ ఇంజినీర్ల బృందం ఇచ్చిన నివేదికలో చాలా అనుకూల అంశాలున్నాయి. జూరాల జలాశయం పక్కన 20 టీఎంసీల సామర్థ్యంతో అదనపు జలాశయ నిర్మాణానికి సంబంధించి నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే కార్యాచరణ మొదలవుతుంది. గద్వాలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ సాగునీటి కష్టాలు తీరుతాయి.– రహీముద్దీన్, ఈఈ, జూరాల ప్రాజెక్టు

గట్టు ఎత్తిపోతలకు శంకుస్థాపన
గద్వాల జిల్లాలోని గట్టు, ధరూరు, కేటీదొడ్డి మండలాల పరిధిలో 33 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు 2018, జూన్‌ 29న గట్టు మండలం పెంచికలపాడు సమీపంలో ఎత్తిపోతలను నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.570 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ ఎత్తిపోతలకు నల్లసోమనాద్రి ఎత్తిపోతలు అని నామకరణం చేశారు. ఇందులో భాగంగా ఇరిగేషన్‌ అధికారులు డీపీఆర్‌ తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఇది మధ్యలోనే నిలిచిపోయింది. ఇదే క్రమంలో 20టీఎంసీల సామర్థ్యంతో జూరాలకు పక్కనే అదనంగా మరో జలాశయాన్ని నిర్మించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

జిల్లా ఇరిగేషన్‌ ఆమోదం..
రిటైర్డ్‌ ఇంజినీర్ల బృందం ఇచ్చిన నివేదికపై జిల్లా ఇరిగేషన్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా జలాశయ నిర్మాణానికి 3,600 ఎకరాలు అవసరమని నిర్ధారించారు. అయితే ఈ కొత్త జలాశయంలో గ్రామాలు, వ్యవసాయ పొలాలు ముంపునకు గురికావని, అంతేకాకుండా కొత్త కాల్వల నిర్మాణాలు కూడా అవసరం లేదని గుర్తించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top