ఇక అబద్ధాలు చెప్పలేరు

New Application Created For Forest Officers In Aadilabad - Sakshi

టైగర్‌జోన్‌లో కొత్త సాఫ్ట్‌వేర్‌ 

అధికారుల పనితీరుపై మానిటరింగ్‌

సాక్షి, జన్నారం(ఆదిలాబాద్‌) :  హాలో.... ఎక్కడున్నావ్‌... నేను అడవిలో ఉన్న సార్‌... అని ఇంట్లో ఉండి  అబద్దం చెబుతాడు ఓ అధికారి. గత వేసవిలో ఓ హోటల్‌లో భోజనం చేస్తున్న ఓ బీట్‌ అధికారికి ఎఫ్‌డీవో ఫోన్‌ చేసి మీ ఏరియాలోని అడవిలో అగ్ని ప్రమాదం జరిగిందంట, అక్కడికి వెళ్లి చూసుకో అని సమాచారం ఇస్తాడు. లేదు సార్‌ నేను అడవిలోనే ఉన్నాను. మీకు వచ్చిన సమాచారం అబద్ధమని తప్పించుకున్నాడు. ఇకనుంచి అబద్ధం చెప్పడానికి వీలులేకుండా చేస్తోంది కొత్త సాఫ్ట్‌వేర్‌. ఇంట్లో కూర్చోని పనిచేశాను. అడవిలో తిరుగాను, అంత బాగానే ఉందని చెప్పి  తప్పించుకునే అవకాశం లేదు. ఆ అబద్ధాలు చెప్పి తప్పించుకునే వారికి స్వస్తి పలుకుతుంది నూతనంగా రూపొందించిన ఎంస్ట్రైబ్‌ సాఫ్ట్‌వేర్‌. 

సత్ఫలితాలిస్తున్న సాఫ్ట్‌వేర్‌
వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిస్ట్యూట్‌ ఆఫ్‌ ఇండియా డెహ్రాడూన్‌ వారు రూపొందించిన ఎంస్ట్రైబ్‌ సాఫ్ట్‌వేర్‌ సత్ఫలితాలిస్తోంది. గతంలో కొందరు కిందిస్థాయి అటవీశాఖ సిబ్బంది విధుల్లో లేకున్న తమ స్వంతపనులపై వెళ్లినా విధుల్లోనే ఉన్నామని అబద్ధాలు చెప్పుకుని విధులకు ఎగనామం పెట్టే వారు. నూతనంగా అమల్లోకి వచ్చిన ఈ ఎంస్ట్రైబ్‌ సాఫ్ట్‌వేర్‌ అధికారుల పని తీరును గమనించడమే కాకుండా వన్యప్రాణులు, అడవుల నరికివేత, పశువులు వివరాలు, నీటి వనరులు, వన్యప్రాణుల ఆనవాళ్లు తదితర అంశాలను సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌ చేస్తే అధికారులు తెలుసుకునే వీలుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను రెండు సంవత్సరాల క్రితం వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వారు దేశంలోని టైగర్‌జోన్‌ ప్రాంతాలలో ఈ సాఫ్ట్‌వేర్‌ ఇచ్చారు. కవ్వాల్‌ టైగర్‌జోన్‌లోనూ ఇచ్చిన ఆ సాఫ్ట్‌వేర్‌ వినియోగంలోకి రాలేదు. ఇటీవల అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం అండ్రాయిడ్‌ ఫోన్‌లు ఇవ్వడంతో సాఫ్ట్‌వేర్‌ ఆ ఫోన్‌లో వేసి అధికారుల పనితీరు పరిశీలించిన అంతగా ఫలితాలు కనిపించలేదు.

నెలకు 26 రోజులు తప్పనిసరి
కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో పని చేసే బీట్‌ అధికారులు, సెక్షన్‌ అధికారులు ఎంస్ట్రైబ్‌ సాఫ్ట్‌వేర్‌లో నెలకు 26 రోజులు పర్యటన వివరాలు పొందురుచాలి. ఒక్క రోజు పొందుపరుచకపోయిన వారు ఆ రోజు విధులకు ఎగనామం పెట్టినట్లే అర్థం. అంతే కాకుండా రోజు ఒకే వైపు వెళ్లిన, బైక్‌పై వెళ్లిన కూడా గుర్తించవచ్చు. వెంటనే వారికి మెమో ఇచ్చి జీతంలో కోత విధిస్తారు. ఒక్కో అధికారి రోజుకు 4 కిలో మీటర్ల దూరంలో పర్యటన చేసిన 55మంది రోజుకు 220 కి.మీ దూరం పర్యటన జరుగుతుందని. దీంతో టైగర్‌జోన్‌లో ప్రొటెక్షన్‌  జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో బీట్‌ అధికారి, సెక్షన్‌ అధికారి తమ విధులు సక్రమంగా నిర్వహించడమే కాకుండా, వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేసినట్లు ఉంటుంది. 

ఉద్యోగులు సాఫ్ట్‌వేర్‌ను వాడేలా చేస్తున్నాం
వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా డెహ్రడూన్‌ వారు రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌తో అనేక ఫలితాలున్నాయి. సిబ్బందిపై మానిటరింగ్‌ కాకుండా పలు విషయాలు కూడా తెలుసుకోవచ్చు. సిబ్బంది తమ రేంజ్‌ కార్యాలయాల్లో రోజువారి డాటా డౌన్‌లోడ్‌ చేసి కంప్యూటర్‌లో పొందుపరుస్తారు. రేంజ్‌ అధికారులు డివిజన్‌కు ఇస్తారు. వాటిని డివిజన్‌ వారిగా సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేస్తాం. దీంతో ఇక్కడి విషయాలు టైగర్‌ కన్జర్వేషన్‌ సోసైటీ దృష్టికి వెళ్తోంది. ఈ విషయంలో సిబ్బందికి సాఫ్ట్‌వేర్‌కు అలవాటు పడి ప్రతి రోజు విధులు నిర్వహణ చేసేలా అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు సిబ్బంది ప్రతి అంశాన్ని సాఫ్ట్‌వేర్‌లోనె పొందుపరుస్తున్నారు.  
– మాధవరావు, ఎఫ్‌డీవో

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top