అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వద్దు 

National ST Commission Chairman Nandakumar Sai Has Instructed Officials Not To Be Negligence About SC And ST Atrocity Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వహించొద్దని జాతీయ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ నందకుమార్‌ సాయి అధికారులను ఆదేశించారు. ఏదైనా ఘటన వెలుగుచూసిన వెంటనే బాధితులకు ఆర్థికసాయం అందించాలని, కేసు నమోదుతో పాటు చార్జిషీట్‌ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. అట్రాసిటీ కేసుల పరిష్కారం, పరిహారం పంపిణీలో ఆలస్యమైతే బాధితులకు చట్టంపై విశ్వసనీయత తగ్గే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా జాతీయ ఎస్టీ కమిషన్‌ చైర్‌పర్సన్‌ నందకుమార్‌ సాయి, సభ్యులు మాయా చింతం, హరిక్రిష్ణ దామొర్, హర్షబాయ్‌ చున్నిలాల్, సంయుక్త కార్యదర్శి ఎస్‌కే రాథో బృందం బుధవారం రాష్ట్రానికి చేరుకుంది.

తొలిరోజు పర్యటనలో  ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కమిషన్‌ సభ్యు లు పర్యటించారు. గురువారం రాష్ట్ర ఉన్నతాధికారులతో కమిషన్‌ సమావేశం నిర్వహించింది. నందకుమార్‌ సాయి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, ప్రభుత్వ విభాగాధిపతులు హాజరయ్యారు . గిరిజన సంక్షేమం, జనజాతి తెగల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను శాఖల వారీగా సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

గిరిజన యూనివర్సిటీ మాత్రమే జాప్యం 
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని నందకుమార్‌ స్పష్టం చేశారు.  500 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాలను కూడా గ్రామ పంచాయతీలుగా నవీకరణ చేసి గిరిజనుల్లో రాజకీయ చైతన్యం పెంచడం శుభపరిణామమంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనల్లో చెంచులు సాగుభూమి కావాలని కోరారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తామన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లు తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతుందని కమిషన్‌ చైర్మన్‌ అభిప్రాయపడ్డారు.

మౌలిక వసతులు కల్పించి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గిరిజనులకు ఉన్నత విద్య కల్పనకు గురుకులాల ఏర్పాటు, ఆశ్రమ పాఠశాలల అప్‌గ్రెడేషన్‌ బాగుందని, గిరిజనుల ఆరోగ్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఇప్పటికే పంపిణీ చేస్తున్నట్లు సీఎస్‌ జోషి వివరించారు. ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను రెండు వందల రోజులకు పెంచాలని పలువురు గిరిజనులు తమను కోరినట్లు నందకుమార్‌ సాయి తెలిపారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అజయ్‌మిశ్రా, రెవెన్యూ కార్యదర్శి సోమేశ్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ క్రిస్టినా జెడ్‌ చొంగ్తు, అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్‌రెడ్డి, నవీన్‌ నికోలస్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top