
హైదరాబాద్: పరిశోధనల్లో కొత్తదనం, సృజనాత్మకత అవసరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అన్నారు. గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇండియన్ కామర్స్ అసోసియేషన్ (ఐసీఏ), ఓయూ కామర్స్ విభాగం, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ‘అఖిల భారత 71వ కామర్స్ సదస్సు’ప్రారంభమైంది. క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం అధ్యక్షతన ప్రారంభమైన ఈ సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎస్ ఎస్‌కే జోషి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశోధనల్లో కొత్తదనంతో పాటు సృజనాత్మకత అవసరమని, అప్పుడే విజయం సాధించగలమని అన్నారు.
మారుతోన్న మార్కెట్ అవసరాలకు అనుకూలంగా పరిశోధనలు ఉండాలని ఆయన సూచించారు. పరిశోధనల వల్ల కనుగొన్న కొత్త అంశాలు, తయారు చేసే వస్తువులు అధిక సంఖ్యలో వినియోగంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఐసీఏ అధ్యక్షుడు సుభాష్ గార్గె మాట్లాడుతూ.. కామర్స్, ఎంబీఏ పరిశోధన విద్యార్థులు, అధ్యాపకులలో పరిశోధనాతత్వాన్ని పెంపొందించేందుకు ప్రతి ఏటా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం అతిథులంతా కలిసి సదస్సు సావనీరును ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్కే మిశ్రా, డెలాయిట్ అధికారి రమేశ్, సదస్సు కార్యదర్శి ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.