సీఎం కేసీఆర్ పెద్ద మోసకారని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారగోని విమర్శించారు.
టీజేఎస్ ప్రధాన కార్యదర్శి నారగోని
ఆసిఫాబాద్ : సీఎం కేసీఆర్ పెద్ద మోసకారని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారగోని విమర్శించారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి విస్మరించారని, దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి అతనే గద్దెనెక్కాడని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చైతన్యయాత్రలో భాగంగా స్థానిక రోజ్‌గార్డెన్‌లో శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ ఒరవడి సృష్టించేందుకే తెలంగాణ జనసమితిని ఏర్పాటు చేశామన్నారు. తాము ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, మనల్ని మనం సంస్కరించుకోవడానికే చైతన్యయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ బలహీనపడిందని, కాంగ్రెస్ ముసలివాళ్లతో కాలం వెల్లదీస్తుందని, మోసం చేసే పార్టీల్లోని ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు బయటకి రావాలని పిలుపునిచ్చారు.
96 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలున్న రాష్ట్రంలో కేవలం 3 శాతం ఉన్న అగ్రవర్ణాలు రాజ్యాధికారం అనుభవిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో రెడ్లు, దొరలు రాజకీయ పదవులు అనుభవిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పథకాలకే పరిమితం చేస్తున్నారన్నారు. రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, రిటైర్డ్ కమీషనర్ నాగు, చంద్రన్న, ఎంపీపీ తారాబాయి, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బద్రి సత్యనారాయణ, భరత్ వాగ్మేరే, రేగుంట కేశవరావు మాదిగ, మాలి సంఘం జిల్లా అద్యక్షుడు నికోడె రవీందర్, సిడాం అర్జు, మొండి పాల్గొన్నారు.