జిల్లాలో రూ.427 కోట్ల రుణమాఫీ | must be aadhar integration to loan waiver | Sakshi
Sakshi News home page

జిల్లాలో రూ.427 కోట్ల రుణమాఫీ

Sep 30 2014 2:01 AM | Updated on Sep 2 2017 2:07 PM

జిల్లా రైతులకు పంట రుణమాఫీ కోసం రూ. 427 కోట్లు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలంబరితి తెలిపారు.

ఖమ్మం జడ్పీసెంటర్: జిల్లా రైతులకు పంట రుణమాఫీ కోసం రూ. 427 కోట్లు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలంబరితి తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీని వివిధ నోడల్ బ్యాంకుల ద్వారా సంబంధిత బ్యాంకులకు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆర్డీవోలు, తహశీల్దార్లు, బ్యాంక్‌మేనేజర్లతో సోమవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

రుణమాఫీ పంపిణీపై కలెక్టర్ బ్యాంకర్లు, అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. రెవిన్యూ అధికారులు, బ్యాంకు అధికారులు సంయుక్తంగా ఆమోదించిన ఎనెగ్జర్-ఈ తుది జాబితా ప్రకారమే రుణమాఫీ అందించాలని ఆదేశించారు. పట్టాదారుపాస్ పుస్తకాలు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఒక్కో బ్యాంకుకు ముగ్గురు వీఆర్వోలు, ఒక ఆర్‌ఐ లేదా డిప్యూటీ తహశీల్దార్ ప్రత్యేకాధికారులుగా వ్యవహరించాలన్నారు. మండల ప్రత్యేకాధికారి తహశీల్దార్ వ్యవహరిస్తారన్నారు.

ప్రతినియోజకవర్గానికో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించామన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు ప్రత్యేక బృందాలను అధికారులుగా నియమించామన్నారు. అర్హులైన రైతులకు ఏమాత్రం అన్యాయం జరగడానికి వీల్లేదన్నారు. ఆధార్‌నంబర్‌ను నమోదు చేసి ఆన్‌లైన్ ద్వారా రుణమాఫీ నివేదిక పంపాలని ఆదేశించారు. రైతుల ఖాతా నంబర్లు, భూ సర్వేనంబర్, భూమి విస్తీర్ణం, రైతుల నివాస స్థితి, పట్టాదారు పాస్‌పుస్తకం  వివరాలు ప్రత్యేక టీమ్‌లు, బ్యాంకు అధికారులు సంయుక్తంగా పరిశీలించిన తర్వాతే రుణమాఫీ ఇవ్వాలని ఆదేశించారు. రుణమాఫీకి ఆధార్ నంబర్ తప్పనిసరి అన్నారు. రుణమాఫీ విషయంలో ఎలాంటి ఒత్తిడికి తలొగ్గొద్దని సూచించారు. ఈ సమావేశంలో జేసీ సురేంద్రమోహన్, జేడీఏ భాస్కరరావు, లీడ్‌బ్యాంకు మేనేజర్ ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.

 ఆధార్ నంబర్ ఇవ్వండి..
 ఆధార్ నంబర్ అనుసంధానం చేస్తేనే రుణమాఫీ వర్తిస్తుందని కలెక్టర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వీఆర్వోలు, బ్యాంకులకు రైతులు తమ ఆధార్ నంబర్లను రెండురోజుల్లో అందజేయాలని సూచించారు. లేనిపక్షంలో రుణమాఫీ వర్తించదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement