ఆస్తి పన్ను వడ్డింపు

Municipalities Increasing Home Taxes In Telangana - Sakshi

తక్షణమే అమలుకు పురపాలక శాఖ ఆదేశం

ఖాళీ స్థలాలు అన్నింటిపైనా పన్ను వసూలు

61 కొత్త పురపాలికల్లో 5 శాతం పెంపు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల ప్రజలపై ఆస్తి పన్ను మోత మోగనుంది. ఈ మున్సిపాలిటీల్లో 5 శాతం ఆస్తి పన్ను పెంపు తక్షణమే (13 నుంచి) అమల్లోకి వచ్చింది. రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌ అధ్యక్షతన ప్రాపర్టీ ట్యాక్స్‌ బోర్డు ఈ నెల 13న సమావేశమై పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా ఏర్పడిన 61 మున్సిపాలిటీల్లో పంచాయతీరాజ్‌ చట్టం నిబంధనల ప్రకారం 5 శాతం ఆస్తి పన్ను పెంచి వసూలు చేయాలని ఆదేశించింది. ఈ మున్సిపాలిటీల నుంచి రూ.81.49 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉండగా, రూ.22.39 శాతం మాత్రమే వసూలు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లను ఆదేశించింది. 

ఖాళీ స్థలాలపై పన్నులు...
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లు, ఖాళీ స్థలాలన్నింటిపై పన్ను విధించేందుకు పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఖాళీ స్థలాల వివరాలను అందించాలని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి లేఖ రాసింది. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వచ్చే సమాచారం మేరకు ఖాళీ స్థలాలపై వెకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ విధించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రాపర్టీ ట్యాక్స్‌ బోర్డు ఆదేశించింది. పన్ను విధించి వసూలు చేసేందుకు వీలుగా ఖాళీ స్థలాలను జియో ట్యాగింగ్‌ చేయాలని కోరింది. రూ.55.46 కోట్ల వెకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ డిమాండ్‌ మరింత పెంచాలని సూచించింది. అదే విధంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 68 మున్సిపాలిటీల్లో ఖాళీ స్థలాలను గుర్తించి పన్నులు విధించాలని కోరింది. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన రూ.143 కోట్ల ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు గట్టిగా ప్రయత్నించాలని బోర్డు ఆదేశించింది. ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు ప్రతి 15 రోజులకోసారి డిమాండ్‌ నోటీసులు పంపించాలని కోరింది. 

కమిషనర్లకు నోటీసులు...
అదనపు నిర్మాణాలు జరిపిన కట్టడాలను గుర్తించి ఆస్తి పన్నులు పెంచి వసూలు చేసేందుకు అమలు చేస్తున్న భువన్‌ కార్యక్రమం అమలులో జాప్యంపై బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 2,82,209 కట్టడాలపై మాత్రమే పన్ను పెంచారని, 28 మున్సిపాలిటీలు మాత్రమే 100 శాతం పెంపును అమలు చేశాయని బోర్డు పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు విఫలమైన 36 మున్సిపాలిటీల కమిషనర్లకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. 
  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top