నీటి కష్టాలకు చెక్‌!

Municipal Officers Face On Water Problems Adilabad - Sakshi

ఆదిలాబాద్‌రూరల్‌: వేసవిని దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతీ సంవత్సరం వేసవిలో తాగునీటి సమస్య ఎదురైతే మున్సిపాలిటీ పరంగా పరిష్కరించేందుకు సాధారణ నిధులు కేటాయించి వేసవి ప్రణాళికను మున్సిపల్‌ ఇంజినీర్‌ అధికారులు రూపొందిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేశారు. త్వరలో జరిగే మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో దీనికి ఆమోదం లభించనుంది. ఆమోదం అనంతరం వేసవి ప్రణాళిక నిధుల వినియోగానికి లైన్‌ క్లియర్‌ అవుతుంది. మున్సిపాలిటీలో ప్రస్తుతం రెండురోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 

దాహార్తి తీర్చేందుకు ప్రణాళిక
పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకుమున్సిపాలిటీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరాకు రూ.10లక్షలు వినియోగించేందుకు మున్సిపల్‌ కౌన్సిల్‌లో ఆమోదం తీసుకోనున్నారు. అలాగే ఎక్కడైనా పైప్‌లైన్‌లు పగిలి నీటి సరఫరా నిలిచిపోతే వెంటనే వాటి మరమ్మతు కోసం అత్యవసరంగా ఈ నిధులు వినియోగించనున్నారు.

పట్టణంలో 25 వేల కుటుంబాలు
ఆదిలాబాద్‌ పాత మున్సిపాలిటీ పరిధిలో 2015 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 25 వేల కుటుంబాలు ఉన్నాయి. పట్టణ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడానికి మావల, లాండసాంగ్వి సమీపంలోని వాగుల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీలో రోజుకు ఒక్కొక్కరికి 135 లీటర్ల నీటిని అందించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రతీరోజు పట్టణానికి 19 మిలియన్‌ లీటర్ల నీళ్లు అవసరం. కానీ ప్రస్తుతం ఆయా సంప్‌హౌస్‌ల నుంచి కేవలం 12 మిలియన్‌ లీటర్ల నీళ్లను మాత్రమే పట్టణానికి సంప్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

దీంతో ఒక్కొక్కరికి కేవలం 90 లీటర్ల నీటిని మాత్రమే అందిస్తున్నారు. పాత పైపులైన్‌ కావడంతో లీకేజీలు అధికమవుతుండంతో రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో 25వేల కుటుంబాలు ఉన్నా కేవలం 13వేల కుటుంబాలకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఉన్నాయి. మిగతా 12వేల కుటుంబాల్లో నల్లాలు లేవు. రూ.100కే నల్లా కనెక్షన్‌ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వీరు కూడా కనెక్షన్‌ తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు మరింత నీటి కొరత ఏర్పడనుంది. 

11,700 కిలో లీటర్ల సరఫరా 
ఆదిలాబాద్‌ పాత మున్సిపాలిటీ పరిధిలో 25వేల కుటుంబాలు ఉండగా ఇందులో 1.17కోట్ల జనాభా ఉంది. వీరి దాహార్తి తీర్చడానికి 8 ఓహెచ్‌ఆర్‌ పాత ట్యాంకులు ఉండగా.. మరో 5 కొత్త ట్యాంకులు నిర్మిస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న ట్యాంకులు ఈ వేసవిలోపు పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఈ సారి కూడా వేసవిలో నీటి ఎద్దడి తలెత్తేలా ఉంది. ఆయా ఓహెచ్‌ఆర్‌ ట్యాంకుల్లో ప్రతీరోజు 11,700 కిలో లీటర్ల సామర్థ్యం నీరు నిల్వ కానుంది.

సెంట్రల్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీర్‌ (సీపీహెచ్‌ఈవో) ప్రకారం ప్రతీ ఒక్కరికి రోజుకు 135 లీటర్ల నీటిని సరఫరా చేయాలి. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న జనాభాకు ప్రతీరోజు 19 మిలియన్‌ లీటర్ల (ఒక కోటి 90లక్షల) నీళ్లు అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పట్టణంలో 170 కిలో మీటర్ల మేరకు పైపులైన్‌ వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోగా.. ఇప్పటి వరకు 156 కిలోమీటర్ల మేర పైపులైన్‌ వేశామని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రతిపాదనలు సిద్ధం చేశాం
ప్రస్తుతం ఉన్న ఓహెచ్‌ఆర్‌ ట్యాంకుల ద్వారా పట్టణ ప్రజలకు ప్రతీరోజు నీటిని సరఫరా చేయలేం. అందుకే రెండు రోజులకో సారి చేస్తున్నాం. కొత్తగా 5 ఓహెచ్‌ఆర్‌ ట్యాంకులు నిర్మిస్తున్నా ఇందులో ఒక ఓహెచ్‌ఆర్‌ ట్యాంకు మాత్రమే పూర్తయ్యేలా ఉంది. మిగతా ఓహెచ్‌ఆర్‌ ట్యాంకులు వేసవిలోగా పూ ర్తి అయ్యేలా కనిపించడం లేదు. పట్టణ ప్రజల దా హార్తిని తీర్చేందుకు రూ.10లక్షల వరకు అవసరమవుతాయి. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలో జరగబోయే కౌన్సిల్‌లో ఆమోదం తీసుకుంటాం.  – మారుతిప్రసాద్, మున్సిపల్‌ కమిషనర్, ఆదిలాబాద్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top