‘మున్సిపల్‌’ ముచ్చట్లు 

Municipal Elections Chaos In Rajanna Sircilla Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: సిరిసిల్ల వెంకంపేట ప్రాంతం.. రాజన్న.. మున్సిపల్‌ ఎన్నికలట మల్లా పోటీ చేస్తవా లేదా..? అరె నాకెందుకురా భయ్‌ నేను చేసింది చాలదా..! నువ్వే పోటీ చెయ్‌.. నేనున్న గదా తమ్మీ.!. అన్నా నీ మద్దతు నాకుండాలే. కర్సయినా సరే. కౌన్సిలర్‌గా మన గల్లీల నిలవడ్త. పోయినసారి నీకైతే నేను పని చేసిన. ఈ సారి నాకు మద్దతు ఇయ్యి. అరే తమ్మీ నా మద్దతు నీకే కానీ పార్టీ టికెట్‌ వస్తుందా?. అరే అన్నా నువ్వు లేవాయే నాకు టికెట్‌ ఇప్పియ్యాలే. సరే తమ్మీ చూద్దాం లే. 

స్థలం: కొత్త బస్టాండు ఏరియా..
అన్నా ఎన్నికలట నువ్వు పోటీ చేస్తున్నావే. అవునే.. నా వయసు యాభై ఇక నాకెప్పుడు గుర్తింపు చెప్పు. మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడొస్తయా అని ఎదురిచూస్తున్నా. ఈసారి పోటీ చేసుడే. అన్నా మరి మీ అన్న ఉన్నడు కదే. నిజమే కానీ అన్నా అని చూస్తే.. నా వయసు అయిపోతుంది. మల్లా రిజర్వేషన్‌ కల్సి వస్తదో లేదో. మా అన్న ఒక్కసారి కౌన్సిలర్‌గా చేసిండు సాలదా. ఎన్నికల్లో అన్నలేదు, తమ్ముడు లేదు. వాడకట్టుల అందర్నీ కూసోవెట్టి మాట్లాడుతం. ఎవ్వరికి మద్దతుంటే వాళ్లే పోటీ చేయాలే. అయితే ఓకే అన్నా నాకు కొద్దిగా పనుంది నువ్వు అన్ని ఏర్పాట్లు చేసుకో.

స్థలం: సిరిసిల్ల పాత బస్టాండు..
హాల్లో అన్నా నమస్తే ఎన్నికలట. నువ్వు కరీంనగర్‌లో ఉంటే ఎట్లనే. నువ్వు జెల్ది రా.. అంటూ ఫోన్‌లో మాట్లాడుతున్నడు రాజేశం. మన వార్డుల ఎన్ని ఓట్లు ఉన్నయి. అందులో మనోళ్లు ఎంత మంది. మందోళ్లు ఎందరు లెక్క తీయాలే. కర్సులకు ఎన్కకుబోకు. నువ్వు జెల్ది సిరిసిల్లకు రా. వచ్చినంక పొద్దుగూకి మనోళ్లకు మందు పార్టీ పెట్టి మాట తీసుకోవాలే. గిప్పుడు బిజినెస్‌ అని కరీంనగర్‌లో కూసుంటే నడ్వది. నాన్‌స్టాప్‌ ఎక్కి సిరిసిల్లకు జెల్ది రా. ఓటర్ల జాబితాలో చాలా మంది పేర్లు లేవట. నీది ఉందో లేదో చూసుకోవాలే. నీవంటే ఓర్వలేనోళ్లు కుట్రలు చేసి పేరు తొలగిస్తరు.
ఆశలు.. వ్యూహాలు.. 
ఇవి సిరిసిల్లలో ఎక్కడ చూసినా కనిపించిన కొన్ని దృశ్యాలు. ఎన్నికల కోలాహలం మొదలైంది. ఆశావహులు పో టీకి సిద్ధమవుతున్నారు. రియల్‌ఎస్టేట్‌లో సంపాదించిన వాళ్లంతా ఈసారి పోటీ చేసి రాజకీయంగా రాణించాలని చూస్తున్నారు. ఏదో ఒక్క పార్టీలో చేరి టిక్కెట్‌ సంపాదించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. సిరిసిల్లలో ఎన్నికల సందడి.. ఆసక్తిగా మారింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top