మైనారిటీలకు 100% సబ్సిడీ రుణాలు

muhammad ali says 100% subsidy for minorities

త్వరలో ముఖ్యమంత్రి వద్దకు ప్రతిపాదనలు: మహమూద్‌ అలీ 

సాక్షి, హైదరాబాద్‌: మైనారిటీలకు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా 100 శాతం సబ్సిడీపై రుణాలు అందించే ప్రతిపాదనను త్వరలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు నివేదిస్తానని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ వెల్లడించారు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్‌లో మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి పథకాలపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం ఆయా పథకాల కింద పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నా బ్యాంకర్లు తిరస్కరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 80 సబ్సిడీ మంజూరు చేస్తున్నా కేవలం 20 శాతం రుణం కోసం బ్యాంకర్లు నిరాకరించటమేమిటని ప్రశ్నించారు. భవిష్యత్‌లో బ్యాంకర్లతో ప్రమేయం లేకుండా ప్రభుత్వమే 100 శాతం సబ్సిడీపై నేరుగా రుణాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రుణాల మంజూరు ప్రక్రియ నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మైనారిటీ ఓవర్సీస్‌ ఉపకార వేతనాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించాలని సూచించారు. మైనారిటీ కుట్టు శిక్షణ, కంప్యూటర్‌ సెంటర్ల నిర్వహణ సరిగ్గా లేదని, వాటి స్థానంలో జిల్లాకు ఒకటి చొప్పున మైనారిటీ అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో ఉన్న ఖాళీ పోస్టులను ప్రభుత్వం త్వరలో భర్తీ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. సమావేశంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్, మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ షఫీ ఉల్లా తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top