అమ్మే ఆదర్శం..

mudigonda tahasildar special story on women empowerment - Sakshi

 నా మూలాలు మరిచిపోను

పేదల సమస్యల పరిష్కారంలో రాజీ పడను

ముదిగొండ తహసీల్దార్‌ రమాదేవి

మొదటి నుంచి కష్టపడే తత్వం.. ఏదైనా అనుకుంటే సాధించే వరకు పట్టు విడవని వైనం.. అమ్మ నేర్పిన క్రమ శిక్షణతో చదువులో రాణింపు.. నాన్న లేకున్నా నలుగురు ఆడ పిల్లలున్న కుటుంబాన్ని ఒంటెద్దు బండిలా లాగిన తల్లిని ఆదర్శంగా తీసుకొని.. స్టెనోగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ.. అనతికాలంలోనే ఉన్నస్థానానికి ఎదిగి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ముదిగొండ తహసీల్దార్‌ రమాదేవి..  

ఖమ్మం, ముదిగొండ: కొత్తగూడేనికి చెందిన మద్దెల సరోజిని, హనుమయ్యకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మద్దెల రమాదేవి, రెండో కూతురు శ్రీదేవి అంగన్‌వాడీ టీచర్, మూడో కుమార్తె పద్మజ ఎంఎస్‌సీ బీఈడీ, నాలుగో కుమార్తె అవంతి బీఎస్సీ నర్సింగ్‌ చేస్తోంది. తల్లి సరోజిని ఇంటర్‌ వరకు చదువుకొని ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. తండ్రి హనుమయ్య సింగరేణి ఉద్యోగి. తండ్రి మరణానంతరం కుటుంబ భారం సరోజినిపై పడింది. ప్రైవేటు స్కూల్‌లో పనిచేస్తూనే కుటుంబాన్ని సాకింది. కుమార్తెలను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఎంతో కష్టపడింది. రమాదేవి కొత్తగూడెంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఓ ప్రైవేటు గర్ల్స్‌ హైస్కూల్లో.. ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌.. సింగరేణి డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం జూనియర్‌ స్టెనోగా 1999లో ఖమ్మంలోని కలెక్టరేట్‌లో ఉద్యోగం సంపాదించారు. చండ్రుగొండలో యూడీసీగా, దమ్మపేటలో ఆర్‌ఐగా, పెనుబల్లి మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా, పని చేశారు. వరంగల్, అశ్వారావుపేటలో ఎలక్షన్‌ ఆఫీసర్, అనంతరం ముల్కలపల్లి, టేకులపల్లి మండల తహసీల్దార్‌గా పనిచేశారు. ప్రస్తుతం ముదిగొండ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రమాదేవి భర్త ప్రసాద్‌ సివిల్‌ çసపై డీటీగా అశ్వారావుపేటలో పని చేస్తున్నారు.

ఇదంతా అమ్మ వల్లే..  
నేను చిరు ఉద్యోగి నుంచి తహసీల్దార్‌ స్థాయికి చేరుకోవడంలో నా తల్లి పాత్ర ఎనలేనిది.  చిన్ననాటి నుంచి ఎంతో శ్రద్ధతో నన్ను చదివించింది. నాన్న లేకున్నా మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. నలుగురు ఆడ పిల్లలని ఏ నాడు భయపడలేదు. నేను ఉన్నతంగా ఆలోచించడానికి కారణం మా అమ్మతో ఉన్న సాన్నిహిత్యమే.. ఆమె చూపిన మార్గంలో నడవడం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా.. విధుల విషయానికి వస్తే.. మండలంలోని అన్ని వర్గాల ప్రజలతో, అధికారులతో  మమేకమైపోతుంటా. నాకు సాధ్యమైనంత వరకు న్యాయం జరిగే విధంగా చూస్తా. నేను ఎక్కడినుంచి వచ్చానో నాకు తెలుసు.. నా మూలాలు మరిచిపోలేదు. కిందస్థాయి నుంచి వచ్చిన నేను పేదల సమస్యల పరిష్కారంలో ఎన్నటికీ రాజీపడను..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top