మట్టి పరిమళం...

Mud Festival In Boduppal Hyderabad - Sakshi

మట్టి మనసును హత్తుకుంది...  

ఆటపాటల్లోఆనందింపజేసింది...  

మట్టే మాణిక్యం..మట్టే బంగారం. మట్టిలో మహిమలెన్నో..అంటూ చిన్నారుల నుంచి యువత  వరకు మట్టిలో మునిగితేలారు. మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలే వాడాలని,
పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిస్తూ ఆదివారం బోడుప్పల్‌ హనుమాన్‌ ఆలయంవద్ద నిర్వహించిన మడ్‌ ఫెస్టివల్‌ ఉత్సాహంగా సాగింది.

బోడుప్పల్‌: సిమ్‌లైన్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌ ఆధ్వర్యంలో బోడుప్పల్‌ హనుమాన్‌ ఆలయం వద్ద ఆదివారం నిర్వహించిన మడ్‌ ఫెస్టివల్‌ ఆకట్టుకుంది. 400 మందికి పైగా యువతీ యువకులు ఇందులో పాల్గొని సందడి చేశారు. ‘మట్టి విగ్రహాలనే వినియోగిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం’ అనే నినాదంతో ఈ ఫెస్టివల్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, పెద్దలు మట్టిలో కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్, తాడాట, రెయిన్‌ డ్యాన్స్‌లతో ఆడిపాడి అలరించారు. ఫెస్టివల్‌ నిర్వాహకుడు కె.జయసింహాగౌడ్‌ మాట్లాడుతూ.. ‘పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఇందుకు అందరూ నడుం బిగించాలి. గుంట తవ్వి ఎర్రమట్టి, బంక మట్టి పోసి.. అందులో నీళ్లు, వన మూలికలు వేసి ఈ వేడుకలు నిర్వహించాం. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకొని, వారుండే కాలనీలోనే నిమజ్జనం చేసి పర్యావరణాన్ని కాపాడాల’ని కోరారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాన్ని దగ్గర్లోని కొలనులో నిమజ్జనం చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top