ఎమ్మార్పీఎస్‌ ర్యాలీ ఉద్రిక్తం | MRPS rally concerns | Sakshi
Sakshi News home page

ఎమ్మార్పీఎస్‌ ర్యాలీ ఉద్రిక్తం

Dec 18 2017 2:45 AM | Updated on Dec 18 2017 2:45 AM

MRPS rally concerns - Sakshi

హైదరాబాద్‌: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆదివారం రాత్రి భారతి సంస్మరణ సభ తరువాత సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు భారీ ర్యాలీగా బయలుదేరిన ఎమ్మార్పీఎస్‌ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినా ఆందోళనకారులు కొంతదూరం వరకు ముందుకు వెళ్లారు. ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. చివరికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టాయి. పోలీసులు మంద కృష్ణ సహా పలువురు ఎమ్మార్పీఎస్‌ నేతలను అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో ఆందోళన సద్దుమణిగింది.

ఒక్కసారిగా ర్యాలీ చేపట్టి..
ఇటీవల హైదరాబాద్‌లోని మడ్‌ఫోర్ట్‌ వద్ద ఎమ్మార్పీఎస్‌ నిర్వహించిన ఆందోళనలో ఎమ్మార్పీఎస్‌ నాయకురాలు భారతి మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ సిక్‌విలేజ్‌ గ్రౌండ్‌లో భారతి మాదిగ సంస్మరణ సభను నిర్వహించారు. దీనికి తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో మాదిగలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతి చిత్రపటం వద్ద క్యాండిళ్లతో శ్రద్ధాంజలి ఘటించారు. మాదిగ కళా మండలి ఆధ్వర్యంలో భారతిని స్మరించుకుంటూ పాటలు పాడి జోహార్లు అర్పించారు. అనంతరం మంద కృష్ణ మాదిగ మాట్లాడారు.

ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలను మోసం చేశాయని ఆరోపించారు. సభ అనంతరం ట్యాంక్‌బండ్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో రాత్రి 10.40 గంటల సమయంలో వేలాది మంది కార్యకర్తలతో కలసి ట్యాంక్‌బండ్‌ వైపు బయలుదేరారు. సభా ప్రాంగణం వద్ద ఉన్న పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా వీలుకాలేదు. తర్వాత కూడా పలుచోట్ల పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ప్యారడైజ్‌ సర్కిల్‌ వద్ద బారికేడ్లు, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసినా.. ఆందోళనకారులు తమతో తెచ్చుకున్న కర్రలతో వాటిని తోసేసి ముందుకు కదిలారు.

లారీలను అడ్డుపెట్టినా నిలువరించలేకపోయారు. చివరికి ఎంజీ రోడ్‌లోని రాంగోపాల్‌పేట్‌ పాత పోలీస్‌స్టేషన్‌ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి.. ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మంద కృష్ణ, మరికొందరు ఎమ్మార్పీఎస్‌ నేతలను అరెస్టు చేశారు. మిగతా ఆందోళనకారులను చెదరగొట్టారు. కాగా.. ఆందోళనకారులు దాడులు చేయడంతో పోలీసులకు చెందిన రెండు వాహనాలు స్వల్పంగా ధ్వంసమ య్యాయి. ఇక ర్యాలీగా వస్తున్న వారిలో ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.


వర్గీకరణపై మోసం చేశారు: మందకృష్ణ
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పారని, మాదిగలను మోసం చేశారని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని అపాయింట్‌మెంట్‌ తీసుకోవడంలో కేసీఆర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దాని మూలంగానే భారతి చనిపోయారని పేర్కొన్నారు. వర్గీకరణ ఉద్యమంలో 8 మంది అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 1న అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. లంబాడీలు, ఆదివాసీల గొడవలకు అధికారులను బలి పశువులను చేయడం తగదని.. సమస్యను పరిష్కరించకుండా వదిలేయడంతో ఉగ్రరూపం దాల్చిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement