పోలీసుల అదుపులో వడ్డీ వ్యాపారులు | money lenders were taken into custody by police | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో వడ్డీ వ్యాపారులు

Feb 8 2018 5:39 PM | Updated on Nov 6 2018 8:28 PM

money lenders were taken into custody by police - Sakshi

పోలీసులు అరెస్టు చేసిన వడ్డీ వ్యాపారులు

సిరిసిల్లక్రైం/ వేములవాడ/ ఎల్లారెడ్డిపేట : వడ్డీవ్యాపారులపై రాజన్న సిరిసిల్ల పోలీసులు ఉక్కుపాదం మోపారు.  ఏకకాలంలో జిల్లావ్యాప్తంగా దాడిచేసి 11మందిని అదుపులోకి తీసుకున్నారు. నిరుపేదలకు అప్పులిచ్చి వారివద్ద అధిక వడ్డీలు వసూలు చేస్తున్నార నే ఆరోపణలతో బుధవారం కొందరు ఫైనాన్షియర్లను అరెస్ట్‌ చేశారు. జిల్లాకేంద్రంతో పాటు వేములవాడ, ఎల్లారెడ్డిపేట మండలాల్లో దాడులు నిర్వహించారు.

సిరిసిల్లలో ఐదుగురు..
సిరిసిల్ల పట్టణంలో వడ్డీవ్యాపారం, ప్రయివేటు చిట్టీలు నడిపిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన ఆడెపు మురళి, సయ్యద్‌ షఫి, వొడ్నాల సత్యనారాయణ, పతెం రవీందర్, దార అశోక్‌ అరెస్ట్‌ చేశారు. వీరివద్ద పెద్ద ఎత్తున ప్రామిసరీనోట్లు, ఖాళీ చెక్కులు, భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఎల్లారెడ్డిపేటలో ముగ్గురు..
ఎల్లారెడ్డిపేట మండలంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎల్లారెడ్డిపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వడ్లూరి సత్యనారాయణను అదుపులోకి తీసుకుని చిట్టీలకు సంబంధించిన రికార్డులను సీజ్‌ చేశారు. రాచర్ల గొల్లపల్లికి చెందిన పెట్రోల్‌ బంక్‌ యజమాని అల్లాడి ప్రేమ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. బస్టాండ్‌ వద్ద చిట్‌ఫండ్‌ నిర్వహిస్తున్న కొండ రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

వేములవాడలో ముగ్గురు..
వేములవాడలో అనుమతులు లేకుండా చిట్టీలు,వడ్డీ వ్యాపారం చేస్తున్న ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. మార్కెట్‌ ప్రాంతంలో కె. కిషన్, మటన్‌మార్కెట్‌ ప్రాంతంలో ఉన్న బి. దశరథం, పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలో ఉన్న కె. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్దనుంచి చిట్టీల రిజిస్టర్లు, ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

పేదరికాన్ని సొమ్ము చేసుకోవద్దు
అవసరాల నిమిత్తం అప్పుకు వచ్చే పేదలకు వడ్డీల మీద వడ్డీలు వేసి సొమ్ము చేసుకోవద్దని ఎస్పీ విశ్వజిత్‌ కాంపాటి అన్నారు. బుధవారం సాయంత్రం పోలీస్‌ కార్యాలయంలో వడ్డీవ్యాపారులను అరెస్టు చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో చాలామంది చట్టానికి వ్యతిరేకంగా వ్యాపారాలు చేస్తున్నారన్నారు. చాలా మంది నేతకార్మికులు అప్పులు చేసి అధిక వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల జాబితా తమ వద్ద ఉందని అందరిపై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఇద్దరు సీనియర్‌ సిటిజన్లకు నోటీసులు ఇస్తున్నామన్నారు. కొండ రమేష్‌ అనే వ్యక్తిని 109 సెక్షన్‌ కింద బైండోవర్‌ చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వెంకటరమణ, టౌన్‌ సీఐ చెల్లగుండ్ల శ్రీనివాస్‌రావు, సీసీఎస్‌ సీఐ భన్సీలాల్‌ ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement