పైసా పనిచేయకుండా రూ.500 కోట్ల బిల్లు | Money grabs The bill of Rs 500 crore | Sakshi
Sakshi News home page

పైసా పనిచేయకుండా రూ.500 కోట్ల బిల్లు

Jun 22 2015 2:51 AM | Updated on Aug 21 2018 8:34 PM

వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఆఖరున కూర్చున్నా అన్నీ అందుతాయి.. అన్న సామెత పోలవరం కాంట్రాక్టర్‌కు...

పోలవరం కాంట్రాక్టర్ మాయాజాలం
మరో రూ.400 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్‌కు అర్హతుందంటూ లేఖ
మొత్తం రూ.900 కోట్లు చెల్లించడానికి రంగం సిద్ధం
పోలవరం నిర్మాణ ప్రగతిపై వాస్తవ నివేదికలిచ్చిన ఇంజనీర్‌పై బదిలీ వేటు

సాక్షి, హైదరాబాద్: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఆఖరున కూర్చున్నా అన్నీ అందుతాయి.. అన్న సామెత పోలవరం కాంట్రాక్టర్‌కు బాగా సరిపోతుంది. పైసా పనిచేయకుండా రూ. 500 కోట్ల విలువైన పనులు చేసినట్లు ప్రభుత్వానికి కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ బిల్లులు సమర్పించగా..

అందుకు పోలవరం అధికార యంత్రాంగం వత్తాసు పలికింది. సదరు కాంట్రాక్టు సంస్థ చెబుతున్న మేరకు పని చేసిందంటూ ఏకంగా ధ్రువీకరించింది. ప్రాజెక్టు నిర్మాణ పని ఒక్క సెంటీమీటర్ కూడా ముందుకు సాగలేదని హైదరాబాద్‌లో కూర్చున్న నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులకు తెలుసు. అయినప్పటికీ సదరు కాంట్రాక్టు సంస్థకు వత్తాసు పలకడానికి వెనుక సర్కారు పెద్దల హస్తమున్నట్టు ఇంజనీర్లు చెబుతుండడం గమనార్హం.
 
పరిశీలన.. నాణ్యత తనిఖీ.. అన్నీ ఒక్కరే
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టర్ ఎంత పనిచేశారనే విషయాన్ని నిర్ధారించడం, చేసిన పనిలో నాణ్యత ఉందో లేదో తనిఖీ చేసి ధ్రువీకరించడం, కాంట్రాక్టర్ పెట్టిన బిల్లులను ప్రభుత్వానికి పంపించడం.. ఇలా అన్ని బాధ్యతలనూ ఒకే అధికారికి ప్రభుత్వం అప్పగించింది. కాంట్రాక్టు సంస్థ పైసా పని చేయకున్నా రూ.500 కోట్ల పనిచేసినట్లు బిల్లులు సమర్పించడానికి ఈ అధికారి సహకరించినట్టు పోలవరం ఇంజనీర్లు చెబుతున్నారు.
 
వాస్తవ నివేదికలిచ్చిన ఇంజనీర్‌పై బదిలీ వేటు
పోలవరంలో వాస్తవంగా జరుగుతున్న నిర్మాణ ప్రగతిని వివరిస్తూ ఈఈ స్థాయి ఇంజనీర్ ప్రతినెలా ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నారు. గత మూడు నెలలుగా అక్కడ పనులేమీ జరగట్లేదని, చూట్టానికి కొన్ని డొక్కు వాహనాలు అక్కడ ఉంచారని, వాటిల్లో సగం వాహనాలకు టైర్లు కూడా లేవంటూ క్రమం తప్పకుండా ప్రభుత్వానికి నివేదికలు పంపారు.  ఆ నివేదికలను పరిగణనలోకి తీసుకుంటే, కాంట్రాక్టర్‌కు అప్పనంగా రూ.500 కోట్లు బిల్లులు చెల్లించడానికి వీలుకాదని ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో ఆ నివేదికలను బుట్టదాఖలు చేయడమేగాక..ౠ ఈఈపై బదిలీ చేయడం విశేషం.
 
మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపునకు రంగం సిద్ధం

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదరు కాంట్రాక్టు సంస్థకు రూ.250 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద చెల్లించింది. కానీ ఆ సంస్థ గత ఏడాదికాలంగా.. అంత మొత్తానికి సరిపడా పనులను కూడా చేయలేదు. కానీ తాజాగా జీవో-22 ప్రకారం మరో రూ.400 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకోవడానికి తమకు అర్హతుందని, ఆమేరకు సొమ్మివ్వాలని కోరుతూ ట్రాన్స్‌ట్రాయ్ సర్కారుకు లేఖ రాసింది. కాంట్రాక్టర్ అడిగిందే తడవుగా మొబిలైజేషన్ కాంట్రాక్టర్ పెట్టిన రూ.500 కోట్ల బిల్లుతో కలిపి.. మొత్తం రూ.900 కోట్లు చెల్లించడానికి ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement