ప్రధాని నరేంద్ర మోదీ పాలన దేశానికి ప్రమాదకరమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పాలన దేశానికి ప్రమాదకరమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం నగరంలోని సుందర య్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం తెలంగాణ గ్రేటర్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే ఆర్థిక రంగంలో సంస్కరణలను వేగవంతం చేశారని, ముఖ్యంగా రైల్వే, రక్షణ, విద్య, వైద్య, బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారని చెప్పారు.
కార్మిక చట్టాలను సవరించి వారి హక్కులను ప్రభుత్వం కాలరాసిందన్నారు. బీజేపీ మతతత్వాన్ని కార్పొరేట్ శక్తులు కూడా సమర్థిస్తున్నాయని, ఇది అత్యంత ప్రమాదకరం అన్నారు. వామపక్షాలన్ని కలసి బలం పుంజుకుని గొప్ప ఉద్యమాలు నిర్మించవచ్చునన్నారు. ప్రాంతీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను సైతం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు జి.రాములు, డి.జి.నర్సింహారావు, గ్రేటర్ నాయకులు ఎం.శ్రీనివాస్, కె.రవి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.