భూపతిరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

MLC Bhupathi Reddy Suspension Nizamabad - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఆర్‌ భూపతిరెడ్డిపై ఎట్టకేలకు సస్పెన్షన్‌ వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్‌ చేస్తూ శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ బుధవారం నిర్ణయం ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం విదితమే. దీనిపై టీఆర్‌ఎస్‌ చేసిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేసిన మండలి చైర్మన్‌ బుధవారం నిర్ణయం ప్రకటించారు. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 2015లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో ఎమ్మెల్సీ పదవిపై సస్పెన్షన్‌ వేటు పడింది. 

 తీర్మానం.. 
భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని కోరుతూ జిల్లాలోని టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు ఏడాది క్రితం తీర్మానం చేశారు. 2017 డిసెంబర్‌ 13న హైదరాబాద్‌లో మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై చేసిన తీర్మానాన్ని పార్టీ జిల్లా ఇన్‌చార్జి తుల ఉమ ద్వారా సీఎం కేసీఆర్‌కు నివేదించారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న భూపతిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం విదితమే. తాజాగా ఆయన ఎమ్మెల్సీ పదవిపై సస్పెన్షన్‌ వేటు పడటం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top