కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం.. హరీశ్‌ ఎక్కడ? | MLA Harish Rao Participates In Yoga Day Celebration | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం.. హరీశ్‌ ఎక్కడ?

Jun 21 2019 2:37 PM | Updated on Jun 21 2019 11:25 PM

MLA Harish Rao Participates In Yoga Day Celebration - Sakshi

సాక్షి, సిద్దిపెట :  తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. సిద్ధిపేట జిల్లాలో నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం సిద్ధిపేట జిల్లాలోని రంగాదాంపల్లి అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన హరీశ్‌.. అనంతరం రంగనాయ సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే హరీశ్‌ రావు యోగా డేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగామవ్వాలని సూచించారు. యోగా చేస్తూ ఆరోగ‍్య సమాజం నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

ప్రొ. జయశంకర్‌కు నివాళలర్పించిన హరీశ్‌
ప్రొ. జయశంకర్‌ వర్థంతి సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు జయశంకర్‌ సార్‌కు నివాళర్పించారు. సిద్ధిపేటలోని జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంత కర్త జయశంకర్‌ అని గుర్తుచేశారు. బంగారు తెలంగాణకు బాటలు చూపిన మహాత్మ అని కొనియాడారు. సార్‌ స్ఫూర్తిని చెదరకుండా తమ గుండెల నిండా పదిలంగా ఉంచుకున్నట్లు తెలిపారు. జయహో జయశంకర్‌ సార్‌. పిడికిలెత్తి పలుకుతోంది తెలంగాణ జోహార్‌ అని పేర్కొన్నారు.

అందుకే కాళేశ్వరం ప్రారంభోత్సవంలో పాల్గొనలేదు : కొత్త ప్రభాకర్‌రెడ్డి
సీఎం కేసీఆర్‌ మినహా ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలందరూ వారి వారి నియోజకవర్గాల్లోనే కాళేశ్వరం ప్రారంభ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని టీఆర్‌ఎస్‌ లోక్‌సభపక్ష ఉపనేత కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. హారీశ్‌ రావు సైతం సిద్దిపేటలో జరుగుతున్న కాళేశ్వరం సంబరాల్లో పాల్గొన్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి అందుతున్నాయని, అందుకే ఈ ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల కారణంగా ఎంపీలు కాళేశ్వరం ప్రారంభోత్సవంలో పాల్గొనలేకపోయామని వివరించారు. కాగా కాళేశ్వరం ప్రారంభ ఉత్సవాలను టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో వెంకటేశ్వరస్వామి, దుర్గమాతకు పూజలు నిర్వహించి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement