‘పెద్ద చెరువు’ను చూసి పిల్లనిచ్చేటోళ్లు

Mission kakatiya brings new look to village - Sakshi

షావుకార్లు తాకట్టు లేకుండా కాయితం మీదే అప్పులిచ్చేవాళ్లు

పోతారెడ్డిపేట చెరువంటే అందరికీ అంత నమ్మకం

25 ఏళ్లుగా ఎండిన పెద్ద చెరువు

‘కాకతీయ’తో పూర్వ వైభవం..

సాక్షి, హైదరాబాద్‌: పెళ్లీడొచ్చిన పోతారెడ్డిపేట పోరగాడుంటే ఆడపిల్లల తల్లిదండ్రులు అటు వైపే మొగ్గు చూపేటోళ్లు. పోతారెడ్డిపేట రైతంటే షావుకార్లు తాకట్టు లేకుండా కాయితం మీదనే అప్పులిచ్చేటోళ్లు. ఎందుకంటే ఆ ఊరు వెనుక ఓ చెరువు ఉంది.

ఆ చెరువును చూసి ఊరికి పిల్లనిచ్చేటోళ్లు. అప్పులిచ్చేటోళ్లు. అంత నమ్మకం ఆ చెరువంటే. ఒక్కసారి చెరువు నిండితే ఐదేళ్ల వరకు ముక్కారు పంటలకు ఢోకా ఉండదు. ఆడబిడ్డలు నీళ్ల కోసం బిందెలు మోస్తూ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఊరు బతుకుదెరువంతా ఆ చెరువు మీదే. ఇదంతా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డిపేట గ్రామంలో ఉన్న పెద్ద చెరువు గురించే.

అయితే ఇదంతా గతం. ఏళ్లకేళ్ల నిర్లక్ష్యంతో చెరువు రూపం కోల్పోయింది. 25 ఏళ్లుగా చెరువు నిండక వరుస కరువుతో పల్లె అల్లాడింది. ఎండిన చెరువు నిండేలా మంత్రి హరీశ్‌రావు పునరుజ్జీవం పోశారు. ‘మిషన్‌ కాకతీయ’కింద రూ.3.79 కోట్లు ఖర్చు చేసి పూర్వ వైభవాన్ని తెచ్చారు. ఇప్పుడా చెరువు కళకళలాడుతోంది.

ఒక్కసారి నిండితే..  
సిద్దిపేట జిల్లాలోనే రెండో ‘పెద్ద చెరువు’. పోతారెడ్డిపేట గ్రామంలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఫీడర్‌ చానల్‌ లేని ఏకైక చెరువు. చుట్టూత 12 గ్రామాల నుంచి దాదాపు 30 నుంచి 35 కిలోమీటర్ల పరిధిలో క్యాచ్‌మెంటు ఏరియా ఉంది.

చెరువు పరిసర గ్రామాలైన పోతారెడ్డిపేట, తాళ్లపల్లి, నగరం, చిన్ననిజాంపేట, రామేశ్వరంపల్లి, మిరుదొడ్డి మండలం, మెదక్‌ జిల్లా నిజాంపేట మండలంలోని ఏ గ్రామంలో పెద్ద వర్షం కురిసినా.. నీళ్లు పెద్ద చెరువులోకే జారేవి. చెరువు కింద 862 ఎకరాల ఆయకట్టు ఉంది. ఒక్కసారి చెరువు నిండితే ఐదేళ్ల వరకు భూగర్భ జలాలకు ఢోకా ఉండదు. సమీప గ్రామా ల్లోని బావులు, బోరు బావుల్లోకి నీళ్లు దిగుతాయి. ఒక్క చెరువు నీళ్ల మీద ఆధారపడి చుట్టూ గ్రామాల్లో 2,500 ఎకరాలకు పైగా పంట సాగయ్యేది.  

‘ఉమ్మడి’ నిర్లక్ష్యం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చెరువు నిర్లక్ష్యానికి గురైంది. విశాలమైన చెరువు క్యాచ్‌మెంటు ఏరియాను కబ్జాదారులు చెరబట్టారు. నీటి ప్రవాహపు దారులన్నీ మూసుకునిపోవటంతో చెరువు జలకళ కోల్పోయింది. 1989 తర్వాత చెరువు ఒక్కసారి కూడా నిండలేదు. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల తర్వాత పెద్ద చెరువుకు మళ్లీ జలకళ వచ్చింది.

మిషన్‌ కాకతీయ కింద ప్రభుత్వం పెద్ద చెరువు పునరుద్ధరణ కోసం రూ.3.79 కోట్లు ఖర్చు చేస్తోంది. చెరువులో పూడిక తీశారు. క్యాచ్‌మెంటు ప్రాంతాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నారు. ఫీడర్‌ చానల్‌ నిర్మాణం చేసి కల్వకుంట చిన్న వాగుతో అనుసంధానం చేస్తున్నారు. చెరువు పునరుద్ధరణ పనులను రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. క్యాచ్‌మెంట్‌ ఏరియా పునరుద్ధరణతో గతేడాది చెరువు నిండి మత్తడి పోసింది. పొలాలు పచ్చబడ్డాయి.

చెరువు నిండితేనే..
పెండ్లీడొచ్చిన యువకులకు బయటి గ్రామాల నుంచి ఆడ పిల్లలను ఇవ్వాలంటే ముందు పెద్ద చెరువు నిండిందా లేదా అని అడిగేటోళ్లు. చెరువు నిండితే కనీసం ఐదేళ్ల వరకు కరువు, కాటకాలు ఉండవని వేరే గ్రామాల ప్రజలకు నమ్మకం. – పేరుడి దయాకర్‌రెడ్డి, రైతు, పోతారెడ్డిపేట

2,500 ఎకరాలకు నీళ్లు
ఫీడర్‌ చానల్‌ లేని ఏకైక చెరువు ఇది. ఇప్పుడు ఫీడర్‌ చానల్‌ కడుతున్నాం. దాన్ని చిన్నవాగుతో అనుసంధానం చేసి మల్లన్న సాగర్‌ కాల్వలకు కలిపి వర్షంతో సంబంధం లేకుండా గోదావరి నీళ్లతో నింపే ప్రయత్నం జరుగుతుంది. దసరాకు చెరువు కింద 2,500 ఎకరాలను సాగులోకి తెస్తాం. – సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్యే

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top