యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు 

Minister Thummala command about Road repaires - Sakshi

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అధికారులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులపై మంగళవారం ఎర్రమంజిల్‌లోని ఈఎన్‌సీ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న రహదారుల నష్టంపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు. 

కేంద్రం నుంచి రూ.800 కోట్ల పనులు మంజూరు 
‘కేంద్ర రహదారుల నిధి నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 668.48 కిలోమీటర్ల నిడివిగల 53 రహదారుల పనులకు కేంద్రం రూ.800 కోట్ల నిధులను మంజూరు చేసింది. సీఎం చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి ఈ నిధులు విడుదలయ్యేలా కృషి చేశారు. ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను ఖరారు చేయండి. 24 నెలల్లోగా వీటిని వినియోగించకపోతే.. నిధులు వెనక్కి వెళతాయి’అని మంత్రి అన్నారు. భారీ వర్షాలకు వంతెనలు తెగిపోయినపుడు తాత్కాలికంగా ఏర్పాటు చేసే బ్రెయిలీ బ్రిడ్జీలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవసరమవుతాయో గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

భవిష్యత్‌ అవసరాల కోసం వీటిని సిద్ధంగా ఉంచాలన్నారు. అలాగే రాష్ట్రంలో ఆలనాపాలనా లేని పిల్లలకు ఆశ్రయం కల్పిస్తోన్న ఎన్జీవోలను తనిఖీలు చేసి వారంలోగా నివేదికలు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. దీనికోసం ఉన్నతస్థాయి అధికారి నేతృత్వంలో కమిటీని వేయాలని సూచించారు. ఎన్జీవోల్లో అధికారుల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆర్‌ అండ్‌ బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌ శర్మ, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ జగదీశ్వర్, ఆర్‌ అండ్‌ బీ   ఈఎన్‌సీ గణపతిరెడ్డి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top