
(ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : పురపాలకశాఖ మంత్రిగా కె. తారక రామారావు సోమవారం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఆదివారం మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మసాబ్ ట్యాంక్‌లోని పురపాలక శాఖ కార్యాలయంలో సంబంధిత విభాగాధిపతులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. దీనితోపాటు ప్రభుత్వ ప్రాధాన్యతలపైన విభాగాధిపతులకు దిశానిర్దేశం చేశారు. ఒకటి, రెండ్రోజుల్లో మళ్లీ సమావేశమవుతానని తెలిపిన మంత్రి.. శాఖ కార్యక్రమాల పురోగతి, భవిష్యత్తు ప్రాధాన్యతలపై నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు.
అనంతరం నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన మంత్రి కేటీఆర్‌కు విభాగాధిపతులు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అలోచనలు, విజన్ మేరకు పనిచేస్తామని మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక సంచాలకులు శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.